పోటాపోటీ
- కాంగ్రెస్, బీజేపీ బహిరంగ సభలు
- కర్ణాటక నుంచే ఎక్కువ సీట్లు లభించే అవకాశం
- కాంగ్రెస్ తరఫున రాహుల్, సోనియా ప్రచారం
- బీజేపీ నుంచి మోడీ
- ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం
- జేడీఎస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ పన్నాగం
- ఓట్లను చీల్చి లబ్ధిపొందాలనుకుంటున్న జేడీఎస్
- ఓటు బ్యాంకు చీలకుండా ‘నమో’ ఎత్తుగడ
సాక్షి, బెంగళూరు :రానున్న లోకసభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుగడలేస్తున్నాయి. దక్షిణాది నుంచి కర్ణాటక నుంచే ఈ అవకాశముండడంతో పూర్తిస్థాయిలో ఇక్కడి ప్రచారంపై ఆయా పార్టీల అగ్రనేతలు దృష్టిసారించారు. ఇందులో భాగంగా పోలింగ్ ప్రక్రియ మొదలయ్యే లోపు ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. జేడీఎస్ కూడా ఆ దిశలోనే ముందుకు కదులుతోంది. అంతేకాకుండా థర్డ్ ఫ్రంట్ తొలి సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
అసమ్మతి చెలరేగకుండా..
రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి వేళ్లూనుకుంది. చాలాకాలంగా పార్టీని నమ్ముకున్న వారికి మంత్రి మండలిలో స్థానం దక్కపోవడం ఇందుకు ప్రధాన కారణంకాగా, ఇదే విషయాన్ని కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తమ అసహనాన్ని వెళ్లగక్కారు. దీంతో అసమ్మతి మరింత చెలరేగకుండా, పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపేందుకు రెండు నెలల వ్యవధిలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి.. ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించారు. జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్న మద్దూరు, మండ్య, టి.నరసిపుర ప్రాంతాల్లో రాహుల్ రోడ్‌షోలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. తద్వారా జేడీఎస్ కంచుకోటను బద్ధలు కొట్టాలన్నదే కాంగ్రెస్ పన్నాగం.
ఓటు బ్యాంక్‌పై ద ృష్టి
పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓట్లు చీలిపోకుండా కమలనాథులు వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో దావణగెరె, మంగళూరు, గుల్బర్గా, హుబ్లీల్లో ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడి నేతృత్వంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రధాన, ప్రస్తుత బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనూ మోడి సభలు నిర్వహించాలన్నదే కమలనాథుల యోచన. ఈ బహిరంగసభలకు ఇటీవల బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరరాజేను ఆహ్వానించనున్నట్లు సమాచారం.
ఓట్లు చీల్చడమే లక్ష్యం..
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో గండి కొట్టేలా జేడీఎస్ వ్యూహం రచిస్తోంది. రానున్న లోకసభ ఎన్నికల్లో మూడు, నాలుగు కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకోలేమని తెలుసుకున్న జేడీఎస్ పెద్దలు థర్డ్‌ఫ్రంట్ పేరుతో లబ్ధిపొందేందుకు చూస్తోంది.
ఈ విషయంలో జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నీ తానై పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా థర్డ్‌ఫ్రంట్ తొలి ఎన్నికల బహిరంగ సమావేశాన్ని బెంగళూరులోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.