ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అంధ నిరుద్యోగ ఉపాధ్యాయులపై పోలీసులు ప్రతాపాన్ని చూపారు. శుక్రవారం రాస్తారోకో నిర్వహించిన వారిపై లాఠీలు ఝుళిపించారు. ఒక యువతి గాయపడి ఆస్పత్రి పాలైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, తదితర డిమాండ్ల సాధన కోసం అంధ నిరుద్యోగ ఉపాధ్యాయులు నాలుగురోజులుగా సాగిస్తున్న ఆందోళన శుక్రవారం నాటికి ఐదోరోజుకు చేరుకుంది. ఏడు మంది ఆందోళనకారులు ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోగా ఆరోగ్యం క్షీణించడంతో వారిని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యం చేయించుకునేందుకు వారు నిరాకరించి ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. తమ ఆందోళనలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు గిండీ రేస్‌కోర్సు రోడ్డులో అకస్మాత్తుగా రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో సుమారు 55 మంది యువతులు సహా 70 మందిని అరెస్ట్ చేశారు.
అలాగే మరో బృందం క్రోంపేటలోని జీఎస్‌పీ రోడ్డులోని బస్‌స్టేషన్ వద్ద అకస్మాత్తుగా రాస్తారోకోకు దిగింది. నడిరోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని చర్చలు జరిపే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలను ప్రయోగించారు. వెంటపడి లాఠీలతో కొట్టడంతో సూర్యకళ అంధ నిరుద్యోగ ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను క్రోంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా మరో 250 మంది వరకు అరెస్ట్ అయ్యారు.
ఈ ఆందోళనపై తమిళనాడు ప్రత్యేక ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు నంబురాజ్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలన్నీ 40 శాతం వైకల్యం ఉన్న స్కాలర్‌షిప్‌లను అందజేస్తుండగా, తమిళనాడు ప్రభుత్వం 60 శాతం ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటోందని విమర్శించారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి సైతం నెలకు *3వేలు చొప్పున ఆర్థికసాయాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1.1 లక్షల మంది ప్రత్యేక ప్రతిభావంతులు ఉన్నారని, హైకోర్టు ఆదేశాలను అనుసరించి వారందరికీ 3 శాతం ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
అమానుషం
Published Sat, Mar 14 2015 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement