ఎన్సీపీ నేత తారిఖ్ స్పష్టీకరణ
పాట్నా: మతతత్వ పార్టీలకు తాము దూరంగా ఉంటామని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకిగాని, శివసేనకు గాని తమ పార్టీ మద్దతు ఇచ్చే అంశం ఏదీ పరిశీలనలో లేదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇవ్వనుందా అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. సైద్ధాంతికంగా తమ పార్టీల మధ్య ఉన్న వైరుద్ధ్యాల నేపథ్యంలో మద్దతు ఇవ్వబోమని కుండబద్దలు కొట్టారు. అవసరమైతే లౌకిక పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి విడిపోవడంతో మిగిలిన పార్టీలు లాభపడే అవకాశముందని ఆయన ఒప్పుకున్నారు. తమ కూటమి విడిపోవడం రెండు పార్టీలకూ పెద్ద దెబ్బేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగా బరిలో దిగడం వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడనుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 69 శాతం ఓట్లు సాధించిన మిగిలిన పార్టీలు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని, అదే పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కానున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్‌లో వేరే పార్టీ అధికారంలో ఉన్నందున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపుతోందని తారిఖ్ విమర్శించారు. అలాగే గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీపై కేంద్రం ఇప్పుడు మాట్లాడటంలేదని ఆరోపించారు.
బీజేపీకి మద్దతు ఇవ్వబోం
Published Sat, Oct 18 2014 10:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement