భార్య గొంతుకోసిన మాజీ భర్త
మైసూరు : విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్న భార్యపై కత్తి దూసి గొంతుకోసి హత్య చేసిన భర్త ఉదంతం మంగళవారం మైసూరు నగరంలోని జేపీ నగరలో చోటు చేసుకుంది. జేపీనగరలోఉన్న 18వ క్రాస్‌లో నివాసం ఉంటున్న సునీత(29)కు తొమ్మిదేళ్ల క్రితం కార్తీక్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 8 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. సునీత తన కుమారుడితో కలిసి నగరంలోనే తల్లి వద్ద నివాసం ఉంటోంది.
కార్తీక్ అప్పుడప్పుడు వచ్చి కుమారుడి బాగుగోగులపై ఆరా తీసేవాడు. మంగళవారం సునీత ఇంటికి వచ్చిన కార్తీక్..తన కుమారున్ని పాఠశాలలో విడిచి తిరిగి ఇంటికి వచ్చాడు. ఈసమయంలో కార్తీక్, సునీత మధ్య గొడవ జరిగింది. ఓదశలో విచక్షణ కోల్పోయిన కార్తీక్..కత్తి తీసుకొని సునీత గొంతుకోసి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న కార్తీక్ కోసం గాలింపు చేపట్టారు.