భార్యను ఫ్లాట్ చేయాలని..
► ఒక్కరోజులో త్రిబుల్ బెడ్‌రూం ఇల్లు
► 15వ తేదీన కట్టించబోతున్న కాఫీ వ్యాపారి
సాక్షి, బెంగళూరు: అర్ధాంగిపై ప్రేమను చాటుకోవడానికి మార్గాలు ఎన్నో. మెచ్చిన ఆభరణాలు కొనివ్వడం, విదేశీ ప్రయాణాలు లాంటివి కొన్ని. సందర్భం ఉన్నా లేకపోయినా కానుకలతో ఆశ్చర్యపరిచే భర్తలు కొందరుంటారు. భార్యపై ప్రేమను చాటుకునేందుకు ఒక భర్త వినూత్న ప్రయత్నం చేయబోతున్నారు. కొడగుకు చెందిన కాఫీ ఉత్పత్తుల వ్యాపారి త్యాగ్ ఉత్తప్ప బెంగళూరులోని టీ అగ్రహారలో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 గంటల్లో ఇంటిని నిర్మించి కానుకగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రీ కన్‌స్ట్రక్షన్ విధానంలో భవణాలను నిర్మించి ఇచ్చే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ పెళ్లిరోజైన జులై 15న ఇంటిని నిర్మించబోతున్నారు.
సంప్రదాయ విధానంలో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు పడక గదుల ఇంటి నిర్మాణానికి సుమారు రూ.75 లక్షల ఖర్చవుతుంది. ఆధునిక ప్రీ కాస్ట్ పద్ధతిలో పన్నులతో కలిపి మొత్తం రూ.48 లక్షల్లోనే పూర్తవుతుందని చెబుతున్నారు. గతంలో ప్రీకాస్ట్ విధానంలో పంజాబ్‌లోని మొహాలీలో 48 గంటల్లో పది అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఇంటి నిర్మాణం పరిశీలనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు రానున్నారు.
ప్రీకాస్ట్.. ప్రయోజనాలెన్నో
ఇంటి నిర్మాణం కోసం అవసరమయ్యే గోడలు, స్లాబు తదితర వాటిని ముందే కాంక్రీట్‌తో సిద్ధం చేసి ఉంచుతారు. అనంతరం వాటిని ఇంటిని నిర్మించే ప్రదేశానికి తరలించి అవసరమైన డిజైన్లలో అప్పటికప్పుడు మార్చుకొని జోడిస్తారు. నాణ్యతలో ఏ మాత్రం లోటుండదు. ఎంతో అనవసర వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అతి తక్కువ సమయంలో ఇంటిని నిర్మాణాన్ని పూర్తి చేయగలడం ప్రీకాస్ట్‌తో సాధ్యమవుతుందని బెంగళూరులో ఈ రంగంలోని నిపుణుడు పీ.మేనన్ తెలిపారు.