విధ్వంసమే లక్ష్యం | Laying siege to hideout, T.N. police trap 2 al-Umma men | Sakshi
Sakshi News home page

విధ్వంసమే లక్ష్యం

Published Mon, Oct 7 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

Laying siege to hideout, T.N. police trap 2 al-Umma men

పట్టుబడ్డ తీవ్రవాదులు రాష్ట్రంలో విధ్వంసమే లక్ష్యంగా పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెలుగు చూసింది. హిందూ నేతలపై దాడులకు సిద్ధమైనా చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తేలింది. దాడులకు కోడ్ భాషగా మిస్డ్‌కాల్‌ను ఎంచుకున్నట్లు   అధికారులు గుర్తించారు. తీవ్రవాదుల పేరిట ముస్లింలను వేధిస్తున్నారంటూ పాపులర్ ఫ్రంట్ ఆదివారం ఆందోళన చేపట్టింది.
 
 సాక్షి, చెన్నై: తీవ్రవాదులు పోలీస్ ఫక్రుద్దీన్ చెన్నైలో, బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్ పుత్తూరులో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. పోలీస్ ఫక్రుద్దీన్‌ను శుక్రవారం రాత్రి నుంచి రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరిపారు. పలు దాడులకు జరిగిన వ్యూహరచనలు ఈ సందర్భంగా వెలుగు చూశాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని లక్ష్యంగా చేసుకుని ఫక్రుద్దీన్ తిరుచ్చిలో రెక్కీ నిర్వహించినట్లు, చివరి క్షణంలో ప్రయత్నాన్ని వీడినట్లు విచారణలో తేలింది. ఈ నెల 18న చెన్నైకి మోడీ వస్తుండడాన్ని, చెన్నై నుంచి తిరుపతికి బయలుదేరుతున్న గొడుగుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు వ్యూహరచన చేయడానికే నగర శివారులో మకాం వేసినట్లు ఫక్రుద్దీన్ అంగీకరించినట్లు తెలిసింది. 
 
 డైరీలో చిట్టా
 ఫక్రుద్దీన్ వద్ద లభించిన డైరీలో రాష్ట్రంలోని హిందూ సంఘాల నేతల పేర్లు, చిరునామాలు ఉండడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న ఇద్దరు బీజేపీ నేతలు, హిందూ మక్కల్ కట్చి నేత, విశ్వహిందూ పరిషత్ నేతను హతమార్చేందుకు చేసిన వ్యూహరచన, రెక్కీ జరిపిన వివరాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు బీజేపీ నేతల హత్యకు తీవ్రవాదులు తీవ్రంగా ప్రయత్నించి చివరిక్షణంలో వెనక్కి తగ్గినట్లు విచారణలో తేలినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. తీవ్రవాదులు తరచూ తమ మకాం మార్చేవారు. తిరునల్వేలి, చెన్నై, కోయంబత్తూరు ఇలా మకాం మారుస్తూ వచ్చారు. తమను పట్టుకునేందుకు రివార్డు ప్రకటించడంతోనే ఆంధ్రప్రదేశ్‌లోని పుత్తూరుకు మకాం మార్చినట్లు విచారణలో ఫక్రుద్దీన్ పేర్కొన్నాడు. ఇస్మాయిల్, బిలాల్ పుత్తూరులోనే ఉండేవారని తెలిపాడు. తాను ఇనుప వ్యాపారం పేరుతో పదేపదే  చెన్నైకి వచ్చి లాడ్జీలో తిష్ట వేసే వాడినని వివరించాడు. ఈ సమయంలో తమకు కావాల్సిన అన్ని వస్తువులనూ కొనుగోలు చేసి తీసుకెళ్లే వాడినని పేర్కొన్నాడు.
 
 మిస్డ్ కాల్ కోడ్
 ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇనుప వ్యాపారం చేయడం, రాత్రుల్లో ఒక చోట చేరి వ్యూహాలు రచించడం తమ దినచర్య అని ఫక్రుద్దీన్ విచారణలో వెల్లడించాడు. తాము ఏదేని దాడులకు సిద్ధమైన పక్షంలో మిస్డ్‌కాల్‌ను కోడ్‌గా ఉపయోగించుకునే వారిమని తెలిపాడు. ఒక్కసారి మిస్డ్ కాల్ ఇస్తే పథకం అమలుకు ఒక చోట చేరే రీతిలో, రెండు సార్లు ఇస్తే పని ముగించేయాల్సిందేనన్న కోడ్‌ను ఉపయోగించామని వివరించాడు. తనకు ఐఎస్‌ఐ తీవ్రవాదులతో సంబంధం ఉన్నట్లు కొన్నిసార్లు, లేదని మరి కొన్నిసార్లు పొంతన లేని రీతిలో ఫక్రుద్దీన్ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తమ నాయకుడు (అల్ ఉమా నేత) ఇమామ్ అలీ హత్యకు ప్రతీకారంగానే దాడులకు పాల్పడ్డామని పేర్కొన్నట్లు తెలిసింది. అబూబకర్ సిద్ధిక్ ఆచూకీ కోసం తీవ్రంగా యత్నించినా నోరు మెదపనట్లు సమాచారం. 
 
 ఇస్మాయిల్‌కు చికిత్స
 పట్టుకునే క్రమంలో తూటా దిగడంతో ఇస్మాయిల్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇతన్ని చికిత్స నిమిత్తం చెన్నై జీహెచ్‌లో చేర్చారు. అతడి శరీరంలోకి దిగిన తూటా గుండెను తాకుతోందని, దానిని తొలగిస్తే ప్రాణానికి హాని కలగవచ్చని వైద్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఇస్మాయిల్‌కు నిర్వహించ తలపెట్టిన శస్త్ర చికిత్స వాయిదా పడింది. అతడికి మెరుగైన వైద్య సేవల్ని అందిస్తున్నారు. పుత్తూరులో గాయపడ్డ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణన్‌కు సుమారు 30 కుట్లు వేసినట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 
 
 ఆందోళన
 తీవ్రవాదుల పేరుతో రాష్ట్రంలోని ముస్లిం యువకుల్ని పోలీసులు వేధిస్తున్నారంటూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో చెన్నైలో ఆదివారం ఆందోళన జరిగింది. రాజారత్నం స్టేడియం వద్ద జరిగిన ఈ నిరసనలో వీసీకే నేత తిరుమావళవన్, పాపులర్ ఫ్రంట్ నాయకుడు ఏఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం యువకులపై తీవ్రవాద ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
 
 తీవ్రవాది కాదు
 ఫక్రుద్దీన్ తీవ్రవాది కాదంటూ ఆయన తల్లి సయ్యద్ మీరా(70) పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫక్రుద్దీన్ తండ్రి సిక్కిందర్ బాషా ఇన్‌స్పెక్టర్‌గా ఈ రాష్ట్రానికి సేవలు అందించారని తెలిపారు. అలాంటి వ్యక్తి కుమారుడు ఫక్రుద్దీన్ తీవ్రవాది మాత్రం కాదన్నారు. ఎప్పుడో ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిన ఫక్రుద్దీన్ రెండేళ్ల క్రితం మరణించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తర్వాత పైప్‌బాంబు కేసులో నిందితుడిగా పేర్కొన్నారని, ఇప్పుడు చిక్కాడని చెబుతున్నారన్నారు. విచారణ పేరుతో ఈ వయసులో తనను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement