►జయ పేరవై తీర్మానంతో చర్చ
►చిన్నమ్మ చేతికి అధికారం చిక్కేనా?
►ఢిల్లీకి పన్నీర్
► ఆసక్తికంగా అన్నాడీఎంకే రాజకీయం
సాక్షి, చెన్నై: సీఎం పన్నీరుసెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు పలువురు మంత్రులు సిద్ధమైనట్టున్నారు. అందుకే కాబోలు చిన్నమ్మ త్వరితగతిన సీఎం పగ్గాలు చేపట్టాలన్న నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్న జయ పేరవై వర్గాలు ఈ నినాదాన్ని అందుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో సీఎం పన్నీరు సెల్వం ఢిల్లీకి పరుగులు తీయడం గమనించాల్సిన విషయం.అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ నాటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్క ర్లేదు.
చిన్నమ్మ శశికళలో అమ్మను చూసుకునేందుకు తగ్గట్టుగా అన్నాడీఎంకే సేనల చర్యలు సాగుతున్నాయి. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలంటూ చిన్నమ్మ మీద ఒత్తిడి తెచ్చే రీతిలో తీర్మానాలు, కాళ్ల మీద పడి మరీ వేడుకోలు పర్వాలు సాగుతున్నాయి. అదే సమయంలో ఇదంతా చిన్నమ్మ దర్శకత్వమేనని విమర్శలు, ఆరోపణలు గుప్పించే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జయ పేరవై తెరమీదకు తెచ్చిన కొత్త నినాదం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. అలాగే, త్వరలో పన్నీరు సీఎం పదవికి ఎసరు తప్పదన్నట్టు ప్రచారం ఊపందుకుంది.
పన్నీరుకు ఎసరా..జయలలిత మరణం తదుపరి సీఎం పగ్గాలు చేపట్టే విషయంగా అన్నాడీఎంకేలో పెద్ద వివాదమే సాగినట్టుగా సంకేతాలు ఉన్న విషయం తెలిసిందే. చివరకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ జోక్యంతో ఆ పదవి పన్నీరు గుప్పెట్లోకి వచ్చిందన్న సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో చినమ్మకు జై కొడుతున్న అమ్మ సేనల్లో అనేకులు ఏకంగా పన్నీరు పదవికి ఎసరు పెట్టేందుకు తగ్గ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా అన్నాడీఎంకేలో తెర మీదకు వస్తున్నాయి. ఇన్నాళ్లు చిన్నమ్మే వారసురాలు, చిన్నమ్మే ప్రధాన కార్యదర్శి అని నినదించిన అన్నాడీఎంకే సేనలు, ఇక సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనని ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకు సాగడం తథ్యం. ఇందుకు తగ్గ తీర్మానం ఏకంగా మెరీనాతీరంలోని అమ్మ సమాధి వద్ద ఆదివారం జయ పేరవై వర్గాలు తీసుకోవడం గమనించాల్సిన విషయం.
జయ పేరవై తీర్మానంతో చర్చ : అన్నాడీఎంకే అనుబంధ విభాగాల్లో జయ పేరవై పాత్ర పార్టీలో కీలకంగా ఉంటున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే తరఫున ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే వారిలో మెజారిటీ శాతం మంది జయ పేరవై వర్గాలే అన్న విషయం తెలిసిందే. ఈ పేరవై నుంచి విజయకేతనం ఎగురవేసే వారిలో పలువురికి మంత్రి పదవులు గ్యారంటీ. ప్రస్తుతం ఈ పేరవైకు రెవెన్యూ మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఈ పేరవై ప్రతినిధులు అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో అందరి కన్నా భిన్నంగా ఈ పేరవై వర్గాలు ఆదివారం తెర మీదకు తెచ్చిన తీర్మానం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. ఏకంగా చిన్నమ్మే సీఎం అంటూ తీర్మానం చేయడమే కాదు, అందుకు తగ్గ నివేదికను తీసుకొచ్చి చిన్నమ్మ శశికళకు సమర్పించి ఆచరణలో పెట్టాలని వేడుకోవడం గమనార్హం.
చిన్నమ్మే సీఎం : దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ సమక్షంలో జయ పేరవై కార్యవర్గం భేటీ అయింది. ఇందులో ఆ విభాగంలోని యాభై జిల్లాల కార్యదర్శులు, మంత్రులు ఆర్‌బీ. ఉదయకుమార్, కడంబూరు రాజు, సేవూరు రామచంద్రన్ పాల్గొని, చిన్నమ్మే సీఎం అని తీర్మానించడం గమనార్హం. ఆర్‌కే నగర్ నుంచి ఆమె పోటీ చేయాలని, సీఎం పగ్గాలు చేపట్టి, అమ్మ వదలి వెళ్లిన పనుల్ని కొనసాగించాలని నేతలందరూ ముక్తకంఠంగా నినదించారు. ఇది తమ నినాదం మాత్రం కాదు అని, అన్నాడీఎంకే వర్గాల ఎదురు చూపుగా జయ పేరవై ప్రకటించడం విశేషం. ఈ తీర్మానంతో ఇక, ప్రధాన కార్యదర్శి పగ్గాలు శశికళ చేపట్టాలని ఇన్నాళ్లు సాగుతున్న నినాదాలు తెర మరుగై సీఎం పగ్గాలు చేపట్టాలని నినదించే వారి సంఖ్య పెరుగుతుందేమో. ఇది కాస్త పన్నీరు పదవికి ఎసరు పెట్టేనా అన్న చర్చ బయలు దేరడం గమనించాల్సిందే. జయ పేరవై తీర్మానం సాగేందుకు కొన్ని గంటల ముందుగా పన్నీరుసెల్వం ఢిల్లీ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.
ఢిల్లీకి పన్నీరు సెల్వం : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకీ పన్నీరు నిర్ణయించారు. సోమవారం ఢిల్లీలో ఈ భేటీ సాగనుంది. వర్దా తాండవంతో ఏర్పడ్డ నష్టాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు తగ్గ నివేదికను సిద్ధం చేసి ఉన్నారు. నిధుల కేటాయింపులతో పాటు, దివంగత సీఎంకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంట్ ఆవరణలో నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తులను ప్రధాని నరేంద్రమోదీ ముందు పన్నీరు ఉంచబోతున్నట్టు సమాచారం. అయితే, ఈ ఢిల్లీ పర్యటన పన్నీరు పదవిని నిలబెట్టేందుకు తగ్గ ప్రయత్నాలుగా కూడా ఉండొచ్చన్న ప్రచారం సాగడం గమనార్హం.