చిత్రహింసలు పెట్టారు | No Indian fishermen in Sri Lankan jails | Sakshi
Sakshi News home page

చిత్రహింసలు పెట్టారు

Published Sun, Aug 17 2014 11:35 PM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM

చిత్రహింసలు పెట్టారు - Sakshi

చిత్రహింసలు పెట్టారు

శ్రీలంక చెర నుంచి విముక్తి పొందిన రామేశ్వరం, పుదుకోట్టై, నాగపట్నం జాలర్లు స్వగ్రామాలకు చేరారు. శ్రీలంక సేనలు చిత్ర హింసలకు గురి చేశాయని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
 
 సాక్షి, చెన్నై:యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో శ్రీలంక సేనలు సృష్టించిన వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికారం మారడంతో తమ తలరాతలు మారతాయన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు నిరాశేమిగిలింది. యూపీఏ హయూంలో ఉన్నప్పుడు కన్నా, తాజాగా బీజేపీ హయూంలో శ్రీలంక సేనలు మరింతగా రెచ్చిపోవడం రాష్ట్ర జాలర్ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. కడలిలో తమకు భద్రత కరువవుతోందని జాలర్లు గగ్గోలు పెడుతున్నా, పాలకులు దృష్టి పెట్టడం లేదు. పట్టుకెళ్లిన వాళ్లను విడిపిస్తున్నారేగానీ, పడవ లను స్వాధీనం చేసుకోవడంలో, దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇన్నాళ్లూ పట్టుకెళ్లిన వారిని సురక్షితంగా విడుదల చేస్తూ వచ్చిన శ్రీలంక సేనలు, ప్రస్తుతం వారి దేశ చెరలో ఉన్న వారిని చిత్ర హింసలకు గురి చేయడం చూస్తే పంథా మార్చినట్టు స్పష్టం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే తమిళ జాలర్లకు ఇక భద్రత కరువైనట్టేనన్నది స్పష్టం కాక మానదు.
 
 విడుదల : జూలై నెలాఖరులో కడలిలో చేపల వేటకు వెళ్లిన తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు ప్రతాపం చూపించారు. రామేశ్వరానికి చెందిన 20 మంది, కోట్టై పట్నం, జగదాపట్నంకు చెందిన 23 మంది, నంబుదాల్, అక్కరై పేట్టై పరిసరాలకు చెందిన మరో 51 మంది జాలర్లను పట్టుకెళ్లారు. 94 మంది జాలర్ల విడుదల కోసం ఓ వైపు రామేశ్వరం వేదికగా, మరో వైపు పుదుకోట్టై వేదికగా జాలర్ల సమ్మె సాగుతోంది. ఎట్టకేలకు భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ జాలర్ల విడుదలకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.
 
 అనురాధపురం చెరలో ఉన్న రామేశ్వరం జాలర్లను, యాల్పానం చెరలో ఉన్న జగదాపట్నం, కోట్టై పట్నం జాలర్లను, కొడియకరై చెరలో ఉన్న ఇతర జాలర్లను ఆయా ప్రాంత కోర్టుల్లో హాజరు పరిచారు. వీరందరినీ జట్లుజట్లుగా భారత దౌత్య అధికారులకు అప్పగించారు. శ్రీలంక చెర నుంచి విముక్తి పొందిన 94 మంది జాలర్లను భారత సరిహద్దుల్లో కోస్టు గార్డుకు అప్పగించారు. తమ బోట్లలో జాలర్లను భారత కోస్టుగార్డు కారైక్కాల్‌కు తరలించింది. అక్కడి నుంచి స్వస్థలాలకు శనివారం రాత్రిజాలర్లను పంపించారు. వీరంతా ఆదివారం ఉదయాన్నే వారి వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. జాలర్లను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కేఏ జయపాల్, ఎంపీ, గోపాల్, నాగపట్నం జిల్లా కలెక్టర్ మునుస్వామి జాలర్లను పరామర్శించారు.  చిత్రహింసలు పెట్టారు: స్వగ్రామాలకు చేరుకున్న జాలర్లకు ఆత్మీయులు, బంధువులు స్వాగతం పలికారు. అయితే 15 రోజులకు పైగా శ్రీలంక చెరలో అనుభవించిన కష్టాలను జాలర్లు తమ వారితో చెబుతూ కన్నీరుమున్నీరయ్యూరు.
 
 తమతో శ్రీలంక సేనలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు సిబ్బంది అవహేళన చేయడం, దురుసుగా మాట్లాడడం, చేయి చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నాగపట్నంకు చెందిన జాలర్లు, రాజేంద్రన్, అమల్, దురైలు పేర్కొంటూ, తమను, తమతో పాటుగా అనురాధపురం చెరలో ఉన్న జాలర్లను ఐస్‌గడ్డల మీద పడుకోబెట్టి నరకాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొందరిని నగ్నంగా ఐస్ గడ్డల మీద పడుకోబెట్టి, మళ్లీ..మళ్లీ తమ భూ భాగంలోకి వస్తారా? అని చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు. తాము భారత సరిహద్దుల్లో ఉంటే పట్టుకొచ్చారంటూ ప్రశ్నిస్తే, మరింతగా వేధించారని, భారత కోస్టు గార్డుకు అప్పగించిన తర్వాత వైద్య సేవలు, సరైన ఆహారం లభించిందని వివరించారు.
 
 జాలర్లపై దాడులు, చిత్ర హింసలతోపాటు సమ్మె ఉధృతం అవుతున్న విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సిద్ధం అయ్యారు. ఆదివారం తిరువారూర్ జిల్లా మన్నార్ కుడిలో విలేకరులతో మాట్లాడిన ఆయన జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందన్నారు. జాలర్లకు భద్రత కల్పించడం, వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా సుష్మా స్వరాజ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఢిల్లీకి వెళ్లగానే సుష్మా స్వరాజ్ దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తానని, జాలర్లతో భేటీకి చర్యలు తీసుకుంటానన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement