తెలుగు అమ్మాయిలంటే అంత చులకనా
- కంచిలోని కళాశాల హాస్టల్‌లో వీడీయోలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి
బెంగళూరు: తమిళనాడులోని కంచిలోని చంద్రశేఖర్ జయేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలో తెలుగు అమ్మాయిలను చులకనగా చూస్తున్నారని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సదరు కళాశాలలోని లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన దుండుగలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్న విషయంపై ఫిర్యాదు చేసిన యువతి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు తెలుగు అమ్మాయి అని తెలుసుకొని అక్కడి నుంచి తరిమి వేసి కళాశాలకు పది రోజులపాటు సెలవు ప్రకటించారన్నారు. తెలుగు అమ్మాయిలు చదువు కోసం పోరుగు రాష్ట్రానికి వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ విభజనే కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సరైన సమయంలో కౌన్సిలింగ్ జరగలేదని, ఆలస్యం కావడం వలనే అమ్మాయిలు పోరుగు రాష్ట్రానికి వెళ్లారని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థినిలకు న్యాయం జరిగేలా భారతదేశంలోని అన్ని తెలుగు సంఘాలు, మహిళ సంఘాలు ఉద్యమించాలన్నారు.
ఈ విషయంపై కర్ణాటక తెలుగు ప్రజా సమితి తరుపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులకు లేఖలు రాస్తున్నట్లు బొందు రామస్వామి చెప్పారు. తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా తాము పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో కేటీపీఎస్ పాయకులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.