మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) వేదికగా ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.
⇒ పాల్గొననున్న సీఎం కేసీఆర్, అన్ని శాఖల మంత్రులు
సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) వేదికగా ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈ మేర కు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 9, 10 తేదీల్లోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ హామీలు, నెరవేర్చేం దుకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాస్తవ పరిస్థితులపై రెండ్రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల కమిషనర్లు, కార్పొరేషన్ల మేనేజింగ్ డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.