బతికున్నా.. లేకున్నా పేర్లు రాయాల్సిందే!  | Central Government Released Guidelines For National Register Of Citizens | Sakshi
Sakshi News home page

బతికున్నా.. లేకున్నా పేర్లు రాయాల్సిందే! 

Published Sat, Mar 7 2020 2:28 AM | Last Updated on Sat, Mar 7 2020 2:28 AM

Central Government Released Guidelines For National Register Of Citizens - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీ పుట్టిన రోజు గుర్తులేదా? ఏ సంవత్సరమో తెలీదా..? ఏ నెలలో, ఏ తేదీన పుట్టారో మీ తల్లిదండ్రులు నమోదు చేయలేదా? మీరు చదువుకోకపోవడంతో సర్టిఫికెట్లలోనూ పుట్టిన తేదీ పేర్కొన లేదా..? అయినా ఫర్వాలేదు.. త్వరలో జరగనున్న జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్‌) నమోదు చేయడానికి వచ్చే ఎన్యూమరేటర్లు మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తారు. ఎలాగో తెలుసా.. వర్షాకాలంలో పుట్టారా? ఎండాకాలం తర్వాత జన్మించారా అని తెలుసుకుం టారు. అప్పుడు ఏ పండుగలున్నాయో చూస్తారు.. పండుగల ఆధారంగా మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ తేలకపోతే మీ కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన వారే మీ శారీరక పరిస్థితి, మీ కుటుంబసభ్యుల వయసు, మీ పిల్లల వయసు ఆధారంగా మీ పుట్టిన తేదీ ఖరారు చేసి నమోదు చేస్తారు.

ఈ మేరకు కేంద్రం ఎన్పీఆర్‌  మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఎప్పుడైనా నిర్ణీత షెడ్యూల్‌లో జనగణనతో పాటు ఎన్పీఆర్‌ను ఏకకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్‌) మీ మూలాలను తేల్చనుంది. మీ తల్లిదండ్రులు ఎక్కడి వారో నమోదు చేయనుంది. వారు బతికున్నా లేకపోయినా వారి పేర్లనూ రికార్డు చేయనుంది. మీ కుటుంబసభ్యులు ఇంట్లో లేకపోయినా, ఏదైనా ప్రాంతంలో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వెళ్లినా, అక్కడ నమోదు చేసుకోకపోతే మీ దగ్గరే వారి పేర్లు, వివరాలను నమోదు చేసుకోనుంది. ఈసారి కొత్తగా సొంత ఇళ్లు లేని వారి జాబితాను కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. 

ఎన్పీఆర్‌ తయారీ మార్గదర్శకాల్లో కొన్ని.. 

  • ప్రతి కుటుంబానికి తాత్కాలిక ధ్రువీకరణ సంఖ్య (టీఐఎన్‌) కేటాయిస్తారు. అందులో రాష్ట్రం, జిల్లా, మండలం, పట్టణం లేదా గ్రామాలకు కోడ్‌ నంబర్లు ఉంటాయి. ఆ తర్వాత 2010, 2015లో రూపొందించిన డేటా ప్రకారం ఇంటి అడ్రస్‌ సరిచూస్తారు. అవసరమైతే చిరునామా మారుస్తారు. ఇందులో పిన్‌కోడ్‌ తప్పనిసరిగా నమోదు చేయాలి. 
  • ఇంట్లో ఉంటున్న వారి సంఖ్య నమోదు చేసి, ప్రతి ఒక్కరికి సీరియల్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తి పూర్తి పేరు (ధ్రువపత్రాల్లో ఉన్న పేర్లతో పోల్చి), యజమానితో బంధుత్వం, ఎన్యూమరేటర్‌ వెళ్లినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నారా.. లేదా.. ఎక్కడికి వెళ్లారనే విషయాలను నమోదు చేస్తారు. 
  • ప్రతి వ్యక్తికి సంబంధించి వివాహమైందా? లేదా అనే అంశాన్ని వయసుతో సంబంధం లేకుండా నమోదు చేసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరి పుట్టిన రోజులు ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ ప్రకారం నమోదు చేస్తారు. 
  • కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎక్కడ పుట్టారనే నే విషయాన్ని విడివిడిగా రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం లేదా పట్టణం లాంటి వివరాలను నమోదు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి భారతీయుడా? కాదా అనేది నిర్ధారిస్తారు. జాతీయత విషయంలో కుటుంబంలోని అందరిని అడిగి రికార్డు చేసుకుంటారు. 
  • పాస్‌పోర్టు నంబర్, విద్యార్హతల వివరాలు, వృత్తి, మాతృ భాషలాంటి సమాచారాన్ని కోడ్‌ ఆధారంగా నమోదు చేస్తారు. 
  • మీతో పాటు మీ నివాసంలోనే పనిమనిషులు శాశ్వతంగా ఉంటే వారి పేర్లను కూడా మీ కుటుంబ వివరాల్లోనే నమోదు చేసుకుంటారు. 
  • మిలిటరీ ఏరియాలు, బయటప్రాంతాల్లో నివసించే రక్షణ సిబ్బంది వివరాలను ప్రత్యేకంగా తీసుకుంటారు. వారి వివరాలను సంబంధిత విభాగాలతో చర్చించిన తర్వాతే జాబితాలో పొందుపరుస్తారు. 
  • యాచకులు, వలసజీవులు, సంచార జీవులు, ప్లాట్‌ఫారాలు, బస్‌స్టేషన్లు, పార్కుల్లో ఉండేవారి వివరాలను కూడా ఈసారి ఎన్పీఆర్‌లో నమోదు చేయనున్నారు. 
  • – కుటుంబ శాశ్వత చిరునామా, ఆ ఇంట్లో ఎంత కాలం నుంచి ఉంటున్నారు. గతంలో ఆ కుటుంబ వివరాలు ఎన్పీఆర్‌లో నమోదయ్యాయా? లేదా అనే విషయాలను కూడా రాసుకుంటారు. ఆధార్, మొబైల్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్లను లభ్యతను బట్టి తీసుకుంటారు. ఈ వివరాలన్నింటినీ కలిపి ప్రతి కుటుంబానికి ఒక సంగ్రహ నివేదికను ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్‌ తయారు చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement