సాక్షి, వరంగల్: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ముదురుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ‘హస్తం’ నేతలు ఆశిస్తున్న స్థానాలను భాగస్వామ్య పార్టీలకు కేటాయిస్తున్నట్లు సంకేతాలు రావడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. అసంతృప్త నేతలు, వారి అనుచరులు ఆందోళన బాట పడుతున్నారు. వరంగల్ పశ్చిమ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీకి చెందిన రేవూరి ప్రకాష్‌రెడ్డికి కేటాయిస్తున్నట్లు లీకులు వచ్చాయి.
దీంతో నాయిని అనుచరులు ఇప్పటికే నిరసన బాట పట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పశ్చిమ టికెట్‌ను నాయిని రాజేందర్‌రెడ్డికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ నేతృత్వంలో పలువురు డీసీసీ భవన్‌లో స్వీయ నిర్బంధం విధించుకోవడంతోపాటు నిరాహారదీక్షకు దిగారు.రాజేందర్‌రెడ్డికి టికెట్ ప్రకటించి బీ ఫాం అందజేసే వరకూ ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్నట్లు కట్ల శ్రీనివాస్ ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా నియోజకవర్గంలోని 24 మంది డివిజన్ అధ్యక్షులు, నాయకులు దీక్షల్లో పాల్గొంటున్నారు. సోమవారం నాటికి రెండో రోజుకు చేరుకోవడంతో పీసీసీ ప్రతినిధిగా సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డీసీసీ భవన్‌కు చేరుకుని దీక్షల్లో ఉన్న నేతలతో చర్చలు జరిపారు.
లోపలకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకుని రాజేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చే వరకూ దీక్షలు విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో వీహెచ్ ఇక్కడి విషయాలను మహాకూటమి నేతలకు వివరించి.. రాజేందర్‌రెడ్డికి టికెట్టు వచ్చే విధంగా తన వంతు ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అదేవిధంగా.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా తూర్పు, వర్ధన్నపేట టికెట్లు టీజీఎస్ పార్టీకి కేటాయిస్తున్నారనే లీకులు రావడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కొండేటికే ఇవ్వాలంటూ ధర్నా.
కూటమి పొత్తుల్లో భాగంగా వర్ధన్నపేటను తెలంగాణ జనసమితి (టీజేఎస్)కు కేటాయిస్తున్నారన్న సంకేతాలతో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అనుచరులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. గాంధీభవన్ ఎదుట అందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటున్న కొండేటి శ్రీధర్‌కు కాకుండా పొత్తుల్లో టీజేఎస్‌కు ఎలా కేటాయిస్తారంటూ ధర్నా చేపట్టారు. పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు శ్రీధర్ అహర్నిశలు కష్టపడ్డారని.. ఆర్థికంగా నష్టపోయాడని.. వర్ధన్నపేట టికెట్‌ను ఆనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించిక తప్పదని పీసీసీ నేతలను హెచ్చరించారు.
తూర్పులో స్వతంత్ర అభ్యర్థిగా ‘రాజనాల’
వరంగల్ తూర్పు టికెట్టును పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్లు పీసీసీ లీకులు ఇవ్వడంతో కాంగ్రెస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలో ఉన్నత స్థాయి పదవులు అనుభవించిన నాయకులు పార్టీని వదిలివెళితే కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు టికెట్ ఇచ్చేది లేదని పీసీసీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన నామినేషన్ అనంతరం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అంతే కాకుండా పార్టీలో టికెట్ రాని అసంతృప్తులు అన్ని నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేలా.. వారిని సంసిద్ధులను చేస్తానని హెచ్చరించారు. డబ్బులున్న రియల్టర్లు, వ్యాపారవేత్తలకు టికెట్లు ఇస్తామంటే ఎట్లా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని 25ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న వారిని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు వెనుకాడేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment