ప్రచారం చేస్తున్న నర్మెటలో ముత్తిరెడ్డి సతీమణి పద్మలతారెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు సతీమణి
రాజకీయ పార్టీల అభ్యర్థులను ఎన్నికల సెగ రాజుకుంటోంది. క్షణ క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. ఓ పక్క పార్టీ కార్యక్తలను కాపాడుకుంటూ మరో పక్క ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలకు గాలం వేస్తూనే ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి మనిషిని, గడపను తడుతున్నారు. భారీ సభలకు అగ్రనాయకులను రప్పించి జన బలాన్ని తమ గెలుపు బలంగా లెక్కలేసుకుంటున్నారు.
సాక్షి, జనగామ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఓరుగల్లు ప్రస్తుతం ప్రచారాల ‘పోరు’గల్లుఉదయం అల్పహారం తీసుకోవడమే ఆలస్యం. ప్రచారం రథంలో ఆశీనులై ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. రాత్రి వరకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏమాత్రం సమయం దొరికినా తమ వాహనంలోనే భోజనం చేస్తున్నారు. ప్రతి గడప తలుపు తట్టుతున్నారు. ఓటర్లను కలిసి చేసిన అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి వివరిస్తూ తమన ఆశీర్వదించాలని కోరుతున్నారు. గ్రామాలతోపాటు మండల కేంద్రాలు, జనగామ మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలవడానికి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారానికి పదును పెడుతుండడంతో పోరుగడ్డ హోరెత్తుతోంది. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ప్రచార హోరు ఊపందుకుంది.
ప్రణాళిక ప్రకారం..
డిసెండర్ 7న జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని గ్రామాలు తిరగాలి, ఎక్కడ ఎంత స మయం కేటాయించాలి, ఏ గ్రామంలో ముఖ్య నా యకులు ఉన్నారు అని ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ప్రచా రంలో భాగంగా ఓటర్లలో అమ్మ ప్రేమను, నాన్న ఆప్యాయతను, తమ్ముడి చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటున్నామని తెలుపుతూ వారిని ఆకట్టుకుంటున్నారు.
సరదాగా..
ప్రచారంలో భాగంగా సరదా సరదా పనులు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పూల కొట్టు వద్ద పూలమ్మడం, తాటి వనంలో గౌడన్నల వద్దకు వెళ్లి కల్లు రుచి చూడడం, బజ్జీలు వేయడం, టీ కాచడం వంటివి చేస్తూ ఇటు ఓటర్లను అటు గ్రామస్తుల మనస్సులు దోచుకుంటున్నారు.
ఓటర్ల వద్దకు..
టీఆర్‌ఎస్, కూటమి, బీజేపీ అభ్యర్థులు పోటీపోటీగా గ్రామాల్లో ప్రచారం చేపడుతున్నారు. నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి తమకు మద్దతు పలకాలని కోరుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పాలకుర్తి నుంచి బరిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ నుంచి పోటీలో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రంగంలో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కూటమి, బీజేపీకి చెందిన అభ్యర్థులు ఓటర్లను కలిసి ఓట్లు అడుగుతున్నారు.
భర్తలకు తోడుగా..
బరిలో నిలిచిన అభ్యర్థులకు తోడుగా వారి సతీమణులు, కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ భర్తల తరఫున ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్‌ఎస్ జనగామఅభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సతీమణి పద్మలతారెడ్డి ఆయన గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. జనగామ మునిసిపాలిటీతో పాటు బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, మద్దూర్, చేర్యాల మండలాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ముత్తిరెడ్డి తనయుడు పృథ్వీరెడ్డి ఎన్నికల్లో నాన్నకు తోడుగా ప్రచార పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తోడుగా ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషాదేవి నియోకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. భర్త దయాకర్‌రావు గెలుపు కోసం పల్లెల్లో పర్యటిస్తూ ఓట్లు అడుగుతున్నారు. టీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్‌లో అభ్యర్థి తాడికొండ రాజయ్య సతీమణి మేరీసైతం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
దగ్గర పడుతున్న సమయం..
ఎన్నికల ప్రచారానికి ఇక వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 7వ తేదీన జరుగనున్న ఓటింగ్‌కు వారంరోజులు మాత్రమే సమయం ఉంది. ఓటింగ్‌కు 48గంటల ముందే ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుంది. దీంతో ప్రచార వేడిని మరింతగా పెంచనున్నారు. ఇప్పటికే అపద్ధర్మ సీఎం కేసీఆర్ మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మిగితా పార్టీల నుంచి అగ్రనాయకులు రావాల్సి ఉంది. అధినేతల ప్రచారంతో పోరుగడ్డ మరింతగా హీటెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment