కరోనా ఎఫెక్ట్‌.. బ్లాక్‌ మార్కెట్‌కు మందులు, మాస్క్‌లు | COVID19 Effect Masks Prices Hikes in Hyderabad | Sakshi
Sakshi News home page

మ..మ..మాస్క్‌!

Published Sat, Mar 7 2020 8:07 AM | Last Updated on Sat, Mar 7 2020 8:07 AM

COVID19 Effect Masks Prices Hikes in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు కరోనా..మరో వైపు స్వైన్‌ఫ్లూ వైరస్‌లు సిటీజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ..? ఏ రూపంలో..? వైరస్‌లు తమను చుట్టు ముడుతాయోనని ఆందోళన చెందుతున్నారు. నియంత్రించలేని స్థితిలో వైరస్‌లు ఉండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే మాస్కులు ధరించడం ఒక్కటే మార్గమని సూచిస్తుంది. దీంతో ప్రజలు మాస్క్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైరస్‌లపై ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని కొంత మంది వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మార్కెట్లో మాస్క్‌లకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వాటి ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వినియోగించే మాస్క్‌ ధర సాధారణ రోజుల్లో రూ.2 నుంచి రూ.3 ఉండగా, ప్రస్తుతం రూ.10 నుంచి రూ.20కి పెంచేశారు. ఇక ఎన్‌–95 మాస్క్‌ ధరలను రూ.250 నుంచి రూ.300 వరకు పెంచేశారు.

బ్లాక్‌ మార్కెట్‌కు మందులు, మాస్క్‌లు
నగరంలోని అనేక ఫార్మాకంపెనీలు తమ మందుల తయారీకి ఉపయోగించే ముడిసరుకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఆయా ముడిసరుకులు దొరుకుతున్నప్పటికీ..ఇక్కడితో పోలిస్తే చైనాలో వాటి ధరలు తక్కువ ఉండటంతో చాలా కంపెనీలు చైనాపైనే ఆధారపడి పని చేస్తున్నారు. ఇలా 58 రకాల మందుల తయారీ కంపెనీలు చైనా ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల చైనాలో కరోనా విజృంభించడం, ఆ దేశం నుంచి హైదరాబాద్‌కు ముడిసరుకు దిగుమతి నిలిచిపోయింది. ఎక్కువ లాభాలు సంపాదించొచ్చు అనే ఆశతో పలు కంపెనీలు తమ వద్ద ఉన్న ముడిసరుకు, తయారైన మందులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. ఆయా మందుల ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. అంతే కాదు మనదేశంతో పోలిస్తే  చైనా, దుబాయ్, ఇరాన్, ఇటలీ, అమెరికా తదితర దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. డిమాండ్‌ తగినన్ని మాస్కులు ఆయా దేశాల్లో దొరక్కపోవడంతో హైదరాబాద్‌లోని ఉత్పత్తి కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి. విదేశాల నుంచి స్వదేశంలోని మాస్క్‌ల కంపెనీలకు ఇటీవల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడితో పోలిస్తే విదేశాల్లో ఈ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్‌ ఉండటంతో ఆయా కంపెనీలు స్థానిక మార్కెట్లకు సరఫరా నిలిపివేసి, కృత్రిమ కొరతకు కారణమయ్యాయి. 

అప్రమత్తమైన ఔషధ నియంత్రణ మండలి
మందులు, మాస్క్‌ల కృత్రిమ కొరతపై తెలంగాణ ఔషధ నియంత్రణ మండలికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఫార్మా కంపెనీలు, మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు, ఫార్మసీలపై దాడులు చేశారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్న పలువురు వ్యాపారులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. మాస్క్‌లు ఉత్పత్తి, విక్రయాలు ఔషధ నియంత్రణ మండలి పరిధిలోకి రావు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ధరలను నియంత్రించేందుకు తగు చర్యలు చేపడుతున్నాం. మాస్క్‌లకు అధిక ధరలకు విక్రయించే వ్యాపారుల ట్రేడ్‌ లైసెన్స్‌లు రద్దు చేయించేందుకు జీహెచ్‌ఎంసీ సహకారం తీసుకుంటున్నట్లు  ఆ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు.  

గాంధీలో 8,ఫీవర్‌లో ఒక అనుమానిత కేసు
కరోనా పాజిటివ్‌గా గుర్తించిన మహేంద్రహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(24) ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన్ను ఒకటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా గాంధీకి మరో 8 అనుమానిత కేసులు వచ్చాయి. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారికి క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న బాధితుల్లో కొంతమంది జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పించడంతో వారంతా చికిత్సల కోసం శుక్రవారం గాంధీకి చేరుకున్నారు. వైద్యులు వీరిని ఐసోలేషన్‌వార్డులో అడ్మిట్‌ చేసి, వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుధ, గురువారాల్లో ఆస్పత్రిలో అడ్మిటైన అనుమానుతులకు సంబంధించి మెడికల్‌ రిపోర్టులు నెగిటివ్‌ వచ్చాయి. దీంతో వారందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి, హోం ఐసోలేషన్‌కు తరలించారు. ఫీవర్‌ ఆస్పత్రిలో మరో అనుమానిత కేసు నమోదైంది. వైద్యులు బాధితున్ని అడ్మిట్‌ చేసుకుని, నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గాంధీకి పంపారు. వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

గాంధీ, ఫీవర్‌కు తగ్గిన ఓపీ..
ఉస్మానియాకు పెరిగిన రోగుల తాకిడికరోనా పాజిటివ్‌ బాధితునితో పాటు అనుమానితులంతా గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్కడ తమకు ఆ వైరస్‌ సోకుతుం దోననే భయంతో రోగులు ఆయా ఆస్పత్రులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల ఓపీ, ఐపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ రోజుల్లో గాంధీ ఓపీ 2500 నుంచి 3000 వరకు ఉండగా, తాజాగా 931 మాత్రమే నమోదవుతుంది. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో 400 నుంచి 500 లోపే ఉంటుంది. సాధరణ జ్వరపీడితులతో పాటు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న రోగులంతా ఉస్మానియాకు క్యూకడుతుండటంతో ఆ స్పత్రి ఓపీ సహా ఐపీ రోగులతో రద్దీగా మారింది. 

గాంధీలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ సహా ఛాతి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా ఆస్పత్రుల్లో మొత్తం వంద పడకలను అందుబాటులో ఉంచింది. తాజాగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సలకు అనుమతి ఇచ్చింది. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించిన తర్వాత ఆయా శాంపిళ్లను గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపాల్సి ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే సదరు రోగిని వెంటనే గాంధీ ఐసోలేషన్‌కు షిఫ్ట్‌ చేసి చికిత్సలు అందిస్తారు. వైద్య పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే..అక్కడి నుంచి వారిని డిశ్చార్జ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement