కొండపాక: నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసే భూములు అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరమని జేసీ శరత్ హెచ్చరించారు. కొండపాక మండలం బందారం గ్రామంలో దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం కింద కొనుగోలు చేయనున్న భూములను ఆయన సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న 44 ఎకరాల స్థలంలో కంప చెట్ల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములను సాగు చేసుకొని బతుకులు బాగుచేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు బోర్లు తవ్వి, కరెంట్ సరఫరా చేస్తామన్నారు. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామన్నారు. సాగు యోగ్యమైన సాగు భూమినే దళితులకు పంపిణీ చేస్తామని శరత్ పేర్కొన్నారు. పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమిపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. భూమిని పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలు తొలగించి ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య, ఎగుర్ల వెంకటేశం, గొట్టె ఐలయ్య, ఆర్‌ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు.
దళితుల భూములు అమ్మినా, కొన్నా నేరమే
Published Thu, Nov 27 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement