కేసీఆర్ మోసాన్ని ప్రజలకు వివరిస్తా
- త్వరలో దళితుల ఆత్మగౌరవ యాత్ర
- సీఎం పదవికి దళితులు అర్హులు కారా?
- మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం దళితుడేనని ప్రకటించి మాట తప్పిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మోసానికి నిరసనగా ‘దళితుల ఆత్మగౌరవ యాత్ర’ చేపట్టనున్నట్టు మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కేసీఆర్ నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచుతానన్నారు. దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని వందల సార్లు మీడియాలో కేసీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ప్రదర్శించి.. ఆయన నిజస్వరూపాన్ని బయటపెడతానన్నారు. తెలంగాణలోని 80 లక్షల మంది దళితుల్లో ఏ ఒక్కరూ సీఎం పదవికి అర్హులు కారా? అని మందకృష్ణ ప్రశ్నించారు. ఈ అంశంపై విశ్వవిద్యాలయాలు, గ్రామాల్లో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు.
దళిత ఆత్మగౌరవ యాత్రకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు నిరసనలు చేపడతామని చెప్పారు. తాను దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన అంబేద్కర్ విధానాలకు కట్టుబడిన బానిసనని, మరి టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొప్పుల ఈశ్వర్ ఎవరికి బానిసలో చెప్పాలని మందకృష్ణ ప్రశ్శించారు.
దళిత సమాజం ఆత్మగౌరవం కోరుతుంటే.. వారు మాత్రం బాంచెన్ దొర అంటూ కాల్మొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొడుకు, మేనల్లుడు, సొంత కులస్తులే కేసీఆర్ సీఎం కావాలని కోరుకోలేదు. అందుకే వారు తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. మీరెందుకు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు? ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా?’ అని ప్రశ్ణించారు.
కేసీఆర్ తెలంగాణ దీక్షకు సంఘీభావం ప్రకటించి.. ఉద్యమానికి ఊపిరి పోసింది తానని, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిందీ తానేనని, అప్పుడు రాజయ్య కాంగ్రెస్‌లో ఉన్నారని గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిగల శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు. బాబు హయాంలోనే వర్గీకరణ జరిగినందున ఆయనపై కృతజ్ఞత చూపిస్తామని మందకృష్ణ పేర్కొన్నారు.