గజ్వేల్‌లో ఎడ్యుకేషన్ హబ్
- ఉత్తర్వులు జారీ
- సీఎం హామీ మేరకు..
- బాలురు, బాలికలకు వేర్వేరుగా
గజ్వేల్:గజ్వేల్ నగర పంచాయతీలో బాలికలు, బాలురకు వేర్వేరుగా ఎడ్యుకేషన్ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12న తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ ప్రత్యేకించి గజ్వేల్ నగర పంచాయతీకి కొత్తరూపు తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న విద్యాసంస్థలను ఒకే సముదాయానికి మార్చడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చిన విషయం కూడా విదితమే.
ఈ మేరకు బాలికలకు, బాలురకు వేర్వేరుగా ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి జీఓలు విడుదలయ్యాయి. టెన్త్ నుంచి పీజీ వరకు వీరికి అవసరమయ్యే విద్యా సంస్థలను హబ్‌లలో నెలకొల్పనున్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల డిగ్రీ కళాశాల కూడా ఇందులో ఉంది. ఈ హబ్‌ల నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఇందుకోసం అవసరమయ్యే స్థలాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం గజ్వేల్‌కు రానున్నారు. జీఓలు విడుదలైన విషయాన్ని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు ధ్రువీకరించారు.