భీంపూర్ మండలం సెంటర్ సాంగ్వి వద్ద వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో 2రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీంపూర్ మండలం సెంటర్ సాంగ్వి వాగు ఉధృతి పెరిగి లోలెవల్ వంతెన పైనుంచి వరద నీళ్లు ప్రవహించాయి. దీంతో ఆదిలాబాద్ నుంచి భీంపూర్‌కు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తాంసి మండలం గిరిగాం గ్రామపంచాయతీలోని వామన్‌నగర్ వద్ద కూడా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణృమహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగ నదిలో వరద ప్రవాహం పెరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి.
గుండేగాంలోకి ప్రాజెక్టు నీరు
భైంసా/భైంసా రూరల్: భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిండింది. దీంతో వరద నీరు గుండేగాం గ్రామంలో ఇళ్లలోకి వచ్చి చేరింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గ్రామస్తులకు అండ గా ఉంటామని, సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి హామీ ఇచ్చారు.
గోదావరిలో తెగిన తాత్కాలిక రహదారి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలుగుల వద్ద గోదావరిపైన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లను కలుపుతూ నిర్మించిన తాత్కాలిక మట్టి రహదారి తెగిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున వరద ఉధృతి పెరగడంతో రహదారి తెగిపోవడంతో 2 జిల్లాలకు సంబంధాలు నిలిచిపోయాయి.
పలుగుల వద్ద తాత్కాలిక రహదారిపై ప్రవహిస్తున్న గోదావరి
Comments
Please login to add a commentAdd a comment