నేనున్నాను.. | I was .. | Sakshi
Sakshi News home page

నేనున్నాను..

Published Mon, Nov 24 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

నేనున్నాను..

నేనున్నాను..

మూడు లక్షల జనాభాతో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ పెద్ద మునిసిపాలిటీ.. స్పెషల్‌గ్రేడ్ పురపాలికగా ఉన్న ఈ పట్టణం రేపోమాపో కార్పొరేషన్‌గా మారబోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సమస్యలు అదేస్థాయిలో ఉన్నాయి. నీటిసమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కోకాలనీలో వారానికి ఒకమారు కూడా నీళ్లురాని పరిస్థితి. లోతట్టుకాలనీలు మురుగునీటి కుంటలుగా మారాయి.

అబ్బో.. దోమల బాధ అంతాఇంత కాదు. రోడ్లన్నీ గోతులమయం.. దుమ్మురేగుతున్న పట్టణరోడ్లపై ముక్కుకు మాస్క్ లేనిదే అస్సలు బయటికి వెళ్లలేం.. విలీనకాలనీలు, గ్రామాల్లో అయితే మరీ ఇబ్బందికరం. రోడ్లు, నీళ్లు, వీధిలైట్లు లేక జనం సతమతమవుతున్నారు. విలీనప్రాంతమైన బీకేరెడ్డి కాలనీలో మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ ఆదివారం ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారారు. నేను ఎవరో తెలుసా? అంటూ పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని..వాటిని పరిష్కరిస్తానని  హామీఇచ్చారు.
 
 రాధాఅమర్: పెద్దాయనా నమస్తే..! బాగున్నారా?
 అక్తర్ ఉస్సేన్: ఆ.. బాగున్నామ్మా!  
 రాధాఅమర్: మీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా?
 అక్తర్ ఉస్సేన్: సమస్యలంటే..? రోడ్డుదే పెద్ద ఫికర్ తల్లీ..! ఇక్కడకు ఆటోలు ఏం రావు. తాగేనీళ్లు రావు. బోర్ల నీళ్లే గతి. ఇదమ్మా మా పరిస్థితి.
 మహ్మద్ షఫీయుద్దీన్: మేడం.. ఈ కాలనీకి సీసీరోడ్డు మంజూరై చాలా రోజులైందట. ఎందుకో ఇంత వరకు పనులు చేస్తలేరు. ఇక మీరు ఇప్పుడు వచ్చారు కానీ.. వానకాలం ఇక్కడ తిరగలేరు. ఈ రోడ్లమీద మొత్తం మురికి నీళ్లు పారుతుంటయి. శానిటరీ వాళ్లకు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా పట్టించుకోరు. ఈ మోరీ మూడు నెలల కింద తీసి.. మళ్లీ ఈ రోజే తీసిండ్రు. ఈ పక్కనే ఎస్టీ హాస్టల్ ఉన్నది. పిల్లలు రోడ్ల మీదకు వచ్చి మూత్రాలు చేస్తరు. వాసన భరించలేకపోతున్నాం. ఈ కాలనీల ఇట్ల ఉండబట్టే ప్రతీఇంట్లో ఎవరోఒకరు రోగాలబారిన పడుతుండ్రు.
 రాధాఅమర్: అమ్మా నమస్తే..! బాగున్నావా?
 లక్ష్మీ: బాగున్నాం. రాధాఅమర్: నేను ఎవరో తెలుసా?
 లక్ష్మీ: తెలుసమ్మ... మీరు చైర్‌పర్సన్ రాధనే కదా!
 రాధాఅమర్: గుర్తుపట్టినందుకు థాంక్స్..! అమ్మా ఈ రోజు నేను ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా వచ్చాను. మీ కాలనీలో సమస్యలేమైనా ఉన్నాయా?
 లక్ష్మీ: ఈ కాలనీకి ఫస్టు రోడ్డు కావాలమ్మా. బీకే రెడ్డి కాలనీ అంటేనే ఆటోలు అస్సలు రావు. ఇక బాలింతలైతే చాన ఇబ్బంది పడుతున్నరు. దవాఖానాకు పోవాలంటే చాన కష్టమవుతున్నది.
 రాధాఅమర్: చూడమ్మా..! మేం మునిసిపల్ చైర్‌పర్సన్‌గా పగ్గాలు చేపట్టి కేవలం నాలుగు నెలలే అవుతోంది. వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఒకటే సర్వేలు చేపిస్తున్నడు. పనులు చేపట్టడానికి పైసలు లేవు. కాస్త ఓపిక పట్టండి. సమస్యలన్నీ ఒకదాని వెంట ఒకటి తీరుస్తాం.. ఏమ్మా బాగున్నారా? కిరాణం షాపు ఎలా నడుస్తోంది?
 పావని: బాగున్నాం మేడం. కిరాణం షాపు ఫర్వాలేదు మంచిగనే నడుస్తది.
 రాధాఅమర్: షాపులో ఏమేం అమ్ముతారు?
 పావని: కూరగాయలు, పాలు, కిరాణషాపు కదా.. జనరల్ అన్నీ అమ్ముతాం.
 రాధాఅమర్: ఈ కాలనీలో సమస్యలేమైనా ఉన్నాయా?
 పావని: మేడం.. ఇక్కడ ఎవర్ని అడిగినా.. ఫస్టు రోడ్డు కావాలంటారు. ఇది తీరుతే మాకు చాన సమస్య తీరినట్లే..!
 రాధాఅమర్: తెలుసు.. జనం మమ్మల్ని కాకపోతే ఎవర్ని తిట్టేది. సరేకాని.. అమ్మా మీరు చెప్పండి ఏం సమస్యలున్నాయి.
 మునీరాబేగం: అమ్మా.. మాకు చాన బాధలున్నయి. మేం ఇక్కడ 20 ఏళ్ల సంది ఉంటున్నం. సాయంత్రమయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లనింకే రాదు. పాములు వస్తున్నాయి. మొన్ననే ఇక్కడి నుంచి ఒక పాము పోయింది. రోడ్లు లేవు. మోరీలు తీసేటొళ్లు రారు. మేమే తీసుకుంటాం. నల్లా పెట్టగానే ఒండ్రునీళ్లు వస్తయి.
 రాధాఅమర్: ఇక్కడ విషయమేంటంటే.. బీకేరెడ్డి కాలనీ.. పట్టణం చుట్టపక్కల గ్రామాలు ఈ మధ్యకాలంలోనే మునిసిపాలిటీలో కలిశాయి. ఇక్కడ చాలా సమస్యలు తిష్టవేశాయి. వాటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తాం. అమ్మా.. మీరు చెప్పండి?
 భాగ్యమ్మ: అమ్మా మేం చెప్పేది ఒక్కటే రోడ్డు కావాలే.
 రాధాఅమర్: చూడండమ్మా... మీ ఇంట్లో మీసారు నెల నాడు డబ్బులు ఇస్తేనే కదా.. ఇంట్లో సామాను తెచ్చేది. మా పరిస్థితి కూడా అంతే అమ్మా. ప్రభుత్వం పైసలు ఇస్తేనే కదా మేము పనులు చేసేది. పైసలు లేకపోతే చేసేదెట్ల?
 భాగ్యమ్మ: అవును... మీరు చెప్పింది కూడా కరెక్టే! పైసలు లేకపోతే మీరైనా ఏం చేస్తారు..!
 రాధాఅమర్: సమస్తే సార్... సమస్యలేమైనా ఉన్నాయా?
 వెంకటేశ్వర్లు: బోలెడు సమస్యలున్నాయి? చెప్పినా తీరవు కదా? మీరు తీర్చలేరు.
 రాధాఅమర్: మేము తీర్చకపోతే ఎవరు తీర్చుతారు?
 వెంకటేశ్వర్లు: అయితే రోడ్లు చూడండి? ఎలా ఉన్నాయి?
 రాధాఅమర్: ప్రయత్నం చేస్తున్నాం కదా?
 వెంకటేశ్వర్లు: ఏం చేస్తున్నారు? కోట్ల రూపాయలు వస్తున్నాయని పేపర్ల వస్తున్నది. మీరు ఏం చేస్తున్నారు?
 రాధాఅమర్: ప్రభుత్వం చెప్పడం తప్పా... ఒక్క పైసా రావడంలేదు. అయినా పేపర్లలో వచ్చేవన్నీ నిజంకాదు. పైసలు రాగానే ఫస్టు మీ కాలనీ పనులకే మొదటి ప్రయత్నం చేస్తా.
  సార్... మీరు చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి?
 ఎంఏ షఫీ: మేడం నేను బీకే రెడ్డి కాలనీకి ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఇక్కడ సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వానకాలంలో మా పరిస్థితి నరకంగా ఉంటది. ఇక్కడ మీరు చూస్తున్న ఏరియా మొత్తం చెరువును తలపిస్తది.
 రాధాఅమర్: ఇంకా ఏమైనా ఉన్నాయా?
 ఎంఏ షఫీ: వాటర్ కూడా అధ్వానంగా ఉన్నాయి. ఆ నీళ్లు తాగడం లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాలనీ మొత్తం హాస్పిటళ్లనే ఉండేది. కాలనీలో వీధిలైట్లు అస్సలు వెలగవు.  
 రాధాఅమర్: చూడండి మేము వచ్చి కేవలం నాలుగు నెలలే అయ్యింది. ఈప్రాంతాలన్ని కూడా కొంత కాలం క్రితమే మునిసిపాలిటీలో కలిశాయి. సమస్యలన్నీ కూడా ఒకేరోజు తీరవు. మా చేతిలో అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తాం.
  ఏం జవాన్ గారు.. ఈ ప్రాంతాల్లో ఎన్నిరోజులకు ఒకసారి క్లీన్ చేస్తుంటారు?
 అక్తర్‌పాష: మేడం.. ఒక్కోవార్డు క్లీన్ చేయడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఎందుకంటే కొంత సమస్య ఉంది. లేబర్ లేదు. నాకింద ఆరుగురు మాత్రమే ఉన్నారు. నాలుగు వార్డులు ఉన్నాయి. ఒక వార్డు పూర్తి కావాలంటే ఒక్కోసారి నెల కూడా పడుతుంది.
 రాధాఅమర్: ఎందుకలా.. ఎవరికీ రాని సమస్య నీకు మాత్రమే ఎందుకుంది?
 అక్తర్‌పాష: లేదు మేడమ్.. ఒక వార్డులో పనిచేస్తుంటే.. మరో వార్డు కౌన్సిలర్ ఫోన్‌చేసి, వెంటనే మనుషులను పంపమంటరు. ఇలా..!
 రాధాఅమర్: మీరు ఒక సిస్టం సెట్ చేసుకోవాలి. కౌన్సిలర్ చెప్పారనో.. చైర్‌పర్సన్ చెప్పారనో కాదు.. ఎంత ఏరియా ఉంది? ఎన్ని రోజులు పడుతుందని ఒక ప్రణాళిక వేసుకోవాలి. శానిటరీ ఇన్‌స్పెక్టర్ గారు మీరు చెప్పండి.. జవాన్ కింద మనుషులను ఎందుకు పెట్టలేదు. మమ్మల్ని బద్నాం చేయాలనుకుంటున్నారా?
 సయ్యద్ మొయినుద్దీన్: మేడం అలా ఏం లేదు. జవాన్ చెప్పేది మొత్తం అబద్ధం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆయన కింద 18 మంది ఉంటే ఆరుగురు మాత్రమే ఉన్నారని చెబుతున్నాడు. జవాన్ కారణంగానే ఈ వార్డుల్లో మనం బద్నాం కావాల్సి వస్తోంది. ఆయన సరిగా పనిచేయరు.
 రాధాఅమర్: ఆయన పనిచేయనప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు?
 సయ్యద్ మొయినుద్దీన్: జవాన్ లోపం వల్లే శానిటరీ ఇబ్బందిగా మారింది. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాం.
 రాధాఅమర్: శానిటరీ వాళ్లు ఇక్కడే ఉన్నారు..! అయ్యా మీరు చెప్పండి ఎన్ని రోజులకొకసారి మోరీలు తీస్తారు?
 వెంకటేష్: పది రోజులకు ఒకసారి మొత్తం తీసేస్తాం.
 రాధాఅమర్: అదేంటి.. అందరూ కూడా మూడు నెలలు అవుతదంటున్నారు?
 వెంకటేష్: ఏం లేదమ్మా.. వాళ్లు అట్లే చెప్తరు. పది రోజుల కింద ఇక్కడ తీసినం.
 రాధాఅమర్: మీ వెంట జవాన్ ఉంటాడా?
 వెంకటేష్: ఆయన రోజూ ఎక్కడంటే అక్కడి పోతుంటడు. మేం చాన తక్కువగా ఉన్నాం. కౌన్సిలర్ ఫోన్ చేస్తడు... అరే ఇక్కడ కుక్క సచ్చింది. పంది సచ్చింది. తీసుకుపోండి అని చెప్తే మేం వెళ్తాం.
 జంగయ్య: మేడం మా ఇబ్బందులు చెప్పొచ్చా..?
 రాధాఅమర్: అయ్యో చెప్పండి.. అలా ఏం కాదు. ఈ రోజు నేను ‘సాక్షి’ రిపోర్టర్‌ను. మీ చైర్‌పర్సన్‌ను కాదులే. భయంలేకుండా చెప్పు!
 జంగయ్య: అమ్మా.. నేను మోరీలు తీసే పనిని 15 ఏళ్ల నుంచి చేస్తున్నా. కుక్కలు సచ్చినా, పందులు సచ్చినా మేమే చేస్తాం. మేం ఇంత చేస్తున్నా... మాకు చేతులకు బ్లౌజులు లేవు. కాళ్ల చెప్పులు లేవు.
 రాధాఅమర్: సరే మీసమస్యలను పరిష్కరిస్తాం. టిట్టర్ గారు మీరు చెప్పండి.. లీకేజీలు ఎందుకవుతున్నాయి?
 వెంకటయ్య: లీకేజీలు అంటే అవుతున్నాయి. ఈ ఏరియాలో పైపులు కేవలం ఫీట్‌న్నర లోతులోనే ఉన్నాయి. బస్సులు పోగానే పగిలిపోతున్నయి. గుత్తేదారు శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు మేడమ్. ఇబ్బంది అవుతున్నది.
 రాధాఅమర్: మెటీరియల్ కోసం డబ్బులు బాగానే తీసుకుంటారు కదా?
 వెంకటయ్య: మెటీరియల్ అంతా ఉంది. మనుషులు లేరు. రాధాఅమర్: డీఈ గారు బీకే రెడ్డి కాలనీలో ఎక్కడ చూసినా సమస్య తిష్టవేశాయి.. ఎందుకలా? మీరేం చేస్తున్నారు. ఈ సమస్య ఇక ఉండొద్దు.
 మధు: విలీన గ్రామాల్లో ఎక్కువగా ఓపెన్ ఫ్లాట్స్ ఉండేవి. గతంలో ఇవన్నీ గ్రామ పంచాయితీలుగా ఉన్నాయి. అప్పుడు వాటర్‌కోసం వేసిన పైపులైన్లు కేవలం పీట్‌న్నర లోతులోనే ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం వల్ల లోడెడ్ వాహనాలు వెళ్తుండటంతో పైపులు పగిలిపోతున్నాయి. రేపటి నుంచి లేబర్‌ను పెట్టి సమస్యను పరిష్కరిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement