పెద్దపల్లి పెద్దన్నలు | Information from Polapalli Constituency Politicians, Karimnagar | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి పెద్దన్నలు

Published Thu, Nov 8 2018 10:18 AM | Last Updated on Thu, Nov 8 2018 11:26 AM

Information from Polapalli Constituency Politicians, Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: పెద్దపల్లి ఓటర్లు జిన్నం మల్లారెడ్డిని మినహాయిస్తే... అందరిని గెలిపించి.. ఓడిస్తున్నారు. ఓడించి గెలిపిస్తున్నారు. 1952నుంచి వరుసగా ఇదే పునరావృతం అవుతోంది. గీట్ల ముకుందరెడ్డి, బిరుదు రాజమల్లు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, విజయరమణారావు అందరూ పడిలేచినవారే. నిలబడి కింద పడ్డవారే. అంతకముందు సైతం పాలించిన శాసనసభ్యులందరూ గెలిచి ఓటమి పాలైనవారే కావడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో దాసరిమనోహర్‌రెడ్డి, విజయరమణారావు, గుజ్జులరామకృష్ణారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో కొత్త ఒరవడి సృష్టించి రాష్ట్రస్థాయి గెలుపులో ప్రత్యేకతను చాటుకున్న దాసరి మనోహర్‌రెడ్డి తిరిగి రెండోసారి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. డిపాజిట్‌ కోల్పోయిన విజయరమణారావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ‘నియోజకవర్గంలో 25ఏళ్ల నుంచి ఎవరికీ ఇక్కడి ప్రజలు రెండోసారి అవకాశం ఇవ్వలేదు.. ఈ సారి గెలిచి చూపిస్తామని’  వీరందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
తొలి ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు
పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 1952–1957,1962 ఎన్నికల్లో వరుసగా ఇండిపెండెంట్‌లు విజయం సాధించారు. తరువాత వారంతా సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గం తొలుత కూనారం నియోజకవర్గంగా ఉండేది. ఈ ఇక్కడి నుంచి ఇద్దరు శాసనసభకు ఎన్నికయ్యారు. సోషలిస్టు పార్టీనుంచి లొట్ల ముత్తయ్య నల్గొండ జిల్లా వాసి ఇక్కడ గెలిచారు. అప్పుడే పోత్కపల్లికి చెందిన ముదుగంటి కొండాల్‌రెడ్డి ఇండిపెండెంట్‌ గెలుపొంది సోషలిస్టు పార్టీలో చేరారు.

1957లో పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ద్విశానసభకు ఎన్నికలు జరుగగా సోషలిస్టుపార్టీ నుంచి బుట్టి రాజరాం గెలుపొందగా ఇండిపెండెంట్‌గా ధర్మారంకు చెందిన పుస్కురి రాంచందర్‌రావు విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1962లో పెద్దపల్లి అసెంబ్లీ స్థానం ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిపై కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన జిన్నం మల్లారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి అదే పార్టీలో చేరారు. 1962నుంచి1978వరకు మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 1977లో దేశంలో ఎమర్జెన్సీ అమలు చేసిన సమయంలో శాసనసభ్యుల పదవీకాలన్ని ఏడాదిపాటు పొడిగించారు. దీంతో మల్లారెడ్డి 16ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. 

రాజిరెడ్డి నుంచి సిట్టింగులకు ఎసరు 
జూలపల్లి మండలం పెద్దపూర్‌ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల రాజిరెడ్డి 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించడంతో కాంగ్రెస్‌ పార్టీ సైతం అక్కడక్కడ సిట్టింగులను మార్చి కొత్తవారిని తెరపైకి తెచ్చింది. దాంతో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఉన్న గీట్ల ముకుందరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది.

ఎనిమిది నెలల ఎమ్మెల్యే 
1983లో ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఉత్తర తెలంగాణలో సంజయ్‌విచార్‌మంచ్‌తో  పొత్తుపెట్టుకుంది. పెద్దపల్లి   స్థానాన్ని సంజయ్‌విచార్‌మంచ్‌ దక్కించుకున్నది. రామగుండం మండలానికి చెందిన గోనె ప్రకాశ్‌రావు ఇక్కడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ఒకసమస్యపై ఎన్టీరామరావును వేధించిన గోనెప్రకాశ్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. పదవి స్వీకరించిన ఎనిమిది నెలలకే రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది.

ఓటమితో మొదలైన గీట్ల ప్రస్థానం
1983లో గోనె ప్రకాశ్‌రావు చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి గీట్లముకుందరెడ్డి రాజకీయ     ప్రస్థా నం అప్పుడే మొదలైంది. ఎనిమిది నెలల కాలంలో వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేముల రమణాయ్యపై గీట్ల విజయం సాధించారు.1983, 1989, 2004లో కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు, టీఆర్‌ఎస్‌ నుంచి ఒకసారి గెలిచిన గీట్ల ముకుందరెడ్డి 2014అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ అశించిన సమయంలో భానుప్రసాద్‌రావుకు టికెట్‌ లభించడంతో షాక్‌ గురైయ్యారు. పదిహేను రోజుల్లో మంచం పట్టి కన్నుమూశారు. పెద్దపల్లి అభివృద్ధిపై విజన్‌ ఉన్ననాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


విలక్షణ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి
1985– 89లలో ఎమ్మెల్యే గెలిచిన రాంచంద్రారెడ్డి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. కాల్వశ్రీరాంపూర్‌ సర్పంచ్‌గా వరుసగా మూడుసార్లు పనిచేసిన ఆయన్ను ఎన్టీఆర్‌ పిలిపించి టీడీపీ టికెట్‌ ఇచ్చారు. దీంతో విజయం సాధించారు. ఐదేళ్లు  పనిచేసిన కాల్వ తిరిగి సిట్టింగ్‌గా తనకు టికెట్‌ వద్దంటూ ఎన్టీఆర్‌ను కలిశారు. కొత్తవారికి అవకాశం ఇవ్వండి అంటూ రాజకీయల నుంచి తప్పుకున్నారు. 1993లో ఆనారోగ్యంతో కన్నుమూశారు.

అ ఎమ్మెల్యే  క్వాటర్‌.. ప్రజలకు సత్రం 

రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం 1994లో మళ్లీ మొదలైంది. పెద్దపల్లి ప్రజలనోట అన్నయ్య అని పిలిపించుకునే బిరుదు రాజమల్లు టీడీపీ నుంచి 43వేల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీ సాధించిన పది మందిలో రాజమల్లు ఒకరు. ప్రజలే కాకుండా అధికారులు సైతం రాజమల్లన్న అంటూ సంబోధించేవారు.  ఎమ్మెల్యేగా ఉన్న  వేళ ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వాటర్‌ సముదాయంలో రెండు క్వాటర్లను ప్రభుత్వం కేటాయించింది.  అ రెండు క్వాటర్లు పెద్దపల్లి ప్రజలకు సత్రాలుగా మారాయి. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన వారేవరైన సరే హైదరాబాద్‌లో లాడ్జి తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజుకు 50మందికి తక్కువ కాకుండా పెద్దపల్లి ఏరియా వాళ్లందరూ అక్కడే ఉంటూ..తింటూ నిద్రిం చేవారు. విద్యార్థుల సైతం క్వాటర్‌ను వాడుకున్నారు. 

గుజ్జుల గెలుపులో వాళ్లే కీలకం
1999– 2004వరకు పాలించిన గుజ్జులరామకృష్ణారెడ్డి టీడీపీ మిత్ర పక్షాల అభ్యర్థిగా బీజేపీ నుంచి విజయం సాధించారు. పెద్దపల్లి ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉండేది. గ్రామాల్లో యువకులను  పోలీసులు చితకబాదేవారు. పోలీసుల దెబ్బలు  తట్టుకోలేక ఆత్మరక్షణ కోసం మాజీ మిలిటెంట్లు బీజేపీలో చేరారు. చాలా మంది రామకృష్ణారెడ్డి సహకారంతో పోలీసుల దెబ్బలను, బూటకపు ఎన్‌కౌంటర్ల నుంచి ప్రాణాలను  కాపాడుకున్నారు. అప్పుడే వచ్చిన ఎన్ని కల్లో టీడీపీ మిత్రపక్షాపు  తమ్ముళ్లు..మాజీ అన్నలు రామకృష్ణారెడ్డిని గెలిపించుకున్నారు. 

మాస్‌లీడర్‌.. విజ్జన్న
బిరుదురాజమల్లు మాదిరి కలుపుగోలు తనపు పలకరింపులు..ముద్దసాని దామోదర్‌రెడ్డి లాంటి రాజకీయ దాడులు ప్రత్యర్థులను చిక్కుల పెట్టే వ్యూహరచనలో నేర్పరి చింతకుంట విజయరమణారావు. బిరుదు, ముద్దసానిల శిష్యరికంలో పెరిగిన విజయ్‌ అనుచర గణాన్ని భారీగా కూడగట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లో అరితేరిన గీట్లముకుందరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై 23వేల ఓట్లమెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ పతనావస్థలో ఉన్న సమయంలో 25వేల ఓట్లు తెచ్చుకుని దాసరి మనోహర్‌రెడ్డి చేతిలో డిపాజిట్‌ కోల్పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ కోసం యత్నిస్తుపోటీకి సిద్ధమౌతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలకు విజయ్‌ పిలుపుఇస్తే వెయ్యిమంది రెండు గంటల్లో  రోడ్డుక్కించే మాస్‌ లీడర్‌.

రాజకీయాల్లో కొత్తమలుపుకకు శ్రీకారం.. 

2014 వరకు టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న దాసరి మనోహర్‌రెడ్డికి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. 63వేల మెజార్టీతో రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచారు. అప్పటి నాయకులంతా చాయనీళ్లతో సరిపుచ్చేవారు. ‘దాసరి’కార్యకర్తల బాగోగులు చూసుసకోవడంతో పాటు సకలజనుల సమ్మెలో మూడు లారీల బియ్యాన్ని చిరుద్యోగులకు పంపిణీ చేశారు.మరోసారి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు.


చందాలు వేసుకొని గెలిపించారు..
పెద్దపల్లి ప్రజలు చాలా మంచివారు. రెండుసార్లు పోటీ చేస్తే అభిమానంతో చందాలు వేసుకొని గెలుపు కోసం కృషి చేశారు. 1989లో పోటీచేసి ఓడిపోగా 1994లో  42వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ఎళ్లకాలం బాకీ పడి ఉంటా. ఓటర్ల ఆత్మగౌరవనికి భంగం కలిగే విధంగా ఏనాడూ ప్రవర్తించలేదు. రెండు సార్లు పోటీ  చేస్తే ఎన్టీరామరావు రూ. 2లక్షలు ఎన్నికల ఖర్చుకోసం ఇచ్చారు.       – బిరుదు రాజమల్లు, మాజీ ఎమ్మెల్యే

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement