క్లర్కు కాదు.. ఖతర్నాక్
సాక్షిప్రతినిధి, నల్లగొండ :స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ సెలవుపై వెళ్లిపోవడానికి ప్రధానకారణంగా చెబుతున్న రూ.8కోట్ల కందిపప్పు, శనగల సరఫరా కాంట్రాక్టు వివాదాస్పదం కావడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 2.41లక్షల మంది లబ్ధిదారులకు ఉద్దేశించిన పథకాలు పక్కదారి పడుతున్నాయి. కందిపప్పు, శెనగలు, గుడ్లు .. ఇలా, ఏ సరుకూ సక్రమంగా సరఫరా కావడం లేదు. సరుకుల సరఫరాలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు ఏజెన్సీ ‘కేంద్రీయ భండార్’ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించిన పీడీని మందలించడమే కాకుండా, సదరు ఏజెన్సీ నుంచి రూ.11ల క్షలు రికవరీ చేయాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. తిరిగి అదే ఏజెన్సీ ఈసారి కూడా టెండరు దక్కించుకునేందుకు నానాతిప్పలే పడుతోంది.
నిబంధనలకు పాతర..
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) భ్రష్టు పట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టులు పొందుతున్న వారు తలా కొంచెం తినిపించి, తాము మిగిలించుకునేందుకు కాంట్రాక్టు నిబంధనలకు పాతరేస్తున్నారు. మొన్నమొన్నటి దాకా అమలులో ఉన్న కాంట్రాక్టు సమయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. సరుకుల సరఫరా కాంట్రాక్టులో భాగంగా, స్థానికంగా లభ్యమయ్యే కందిపప్పును అరకేజీ, కేజీ ప్యాకింగుల్లో సరఫరా చేయాల్సి ఉండగా, అదేమీ పట్టించుకోవడం లేదు. అదే మాదిరిగా, స్థానికంగా లభ్యమయ్యే కందిపప్పు కాకుండా, చౌకగా దొరికే ‘టాంజానీయా’ దేశం నుంచి ఇక్కడకు దిగుమతి అవుతున్న నాసిరకం పప్పును సరఫరా చేశారు.
ఇక, కందిపప్పు లోడ్లు సీడీపీఓ పాయింట్లకు చేరినప్పుడు కచ్చితంగా వేయింగ్ బ్రిడ్జి నుంచి తూకం వేయించి తీసుకున్న బిల్లులు చూపించాలి. కానీ, అది ఎక్కడా అమలు కావడం లేదు. అంతే కాకుండా, సివిల్ సప్లయీస్ అధికారులు పప్పులో తేమశాతాన్ని పరీక్షించి ఓకే చేస్తేనే సరుకు దించుకోవాలి. కానీ, ఎక్కడా తనిఖీలు జరగకుండా కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు లాభం చేస్తున్నారు. ఈ విషయంలో ఆరోపణలు రావడం వల్లే జిల్లా ఉన్నతాధికారులు పీడీని మందలించడంతో ఆమె సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు కందిపప్పు, శెనగలు సరఫరా చేసే కాంట్రాక్టు ఈ ఏడాది జూన్‌తోనే ముగిసినా, రెండు నెలలపాటు అదనంగా ఎందుకు గడువు పొడిగించారన్న ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం లేదు.
ఇదివరకు గుడ్ల సరఫరా విషయంలోనూ కాంట్రాక్టు సంస్థకు ఇదే తరహా మినహాయింపులు ఇచ్చి టెండర్లు జరగకుండా చూశారు. ఇప్పుడు కూడా టెండర్లు పిలవాల్సిన సమయం కంటే రెండు నెలలు ఆలస్యంగా పిలిచారు. ఇలా సహకరించినందుకు భారీగానే ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి కార్యాలయానికి కనీసం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల దాకా చేతులు తడిపినట్లు తెలుస్తోంది. అదే మాదిరిగా, సరుకు ఎలా ఉన్నా , ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అన్‌లోడ్ చేసుకుని సహకరిస్తున్నందుకు కొందరు సీడీపీఓలకు ప్రతినెలా రూ.5వేల దాకా నెలవారీ పర్సెంటేజీలు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులు కలిసి ప్రభుత్వ సొమ్మును పంచేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.