అధికారం లేక మేం ఏడుస్తుంటే ....
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుపై సీఎల్పీ నేత జానారెడ్డి పెదవి విప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జానారెడ్డి స్పష్టం చేశారు. పొన్నాలను సంప్రదించే సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన బుధవారమిక్కడ తెలిపారు. తమ మధ్య ఆధిపత్య పోరు లేనేలేదని అన్నారు. 'అధికారం లేక మేమేడుస్తుంటే ఇక ఆధిపత్యపోరెక్కడది' అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సమిష్టి నాయకత్వమే సమర్థ నాయకత్వమని, సీనియర్లంతా సమన్వయంతో సహకరించుకుంటూ పార్టీని నడపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే నెలలో తలపెట్టిన సమీక్ష సమావేశాలను పొన్నాల ప్రకటిస్తారని జానారెడ్డి తెలిపారు.
కాగా జానారెడ్డి వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరితోనూ సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం, ప్రజాసమస్యలను శాసనసభా వేదికగా పరిష్కరించేందుకు కృషి చేయడం వంటి అంశాలు ఎజెండాగా ఖరారు చేశారు.
టీపీసీసీకి రథసారథిగా పొన్నాల లక్ష్మయ్య కొనసాగుతున్నా, ఆయన ప్రమేయం లేకుండా జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. జానా చర్యలతో కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు తెర తీసినట్లయిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.