కృష్ణాలో నీటి ప్రవాహానికి కర్ణాటక అడ్డుకట్ట
♦ తొలగించేందుకు తెలంగాణ రైతుల యత్నం
♦ అదుపులోకి తీసుకున్న కృష్ణా పోలీసులు
మాగనూర్: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు.. మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండల పరిధిలో గల కృష్ణానదిలో నీటి ప్రవాహానికి కర్ణాటక అడ్డుకట్ట వేసింది. ఆ నీటిని శక్తినగర్‌లోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ (కేపీసీ) పవర్‌ప్లాంట్‌కు తరలిస్తోంది. వారం రోజుల నుంచి ప్లాంట్ అధికారులు అడ్డుకట్ట వేయడంతో కిందికి చుక్కనీరు రావడం లేదు. దీంతో దిగువన ఉన్న తెలంగాణ ప్రాంత రైతుల పొలాలు చివరి తడికి నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయి.
కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు కరువైంది. దీంతో సరిహద్దు ప్రాంతాలైన గుడెబల్లూర్, మారుతీనగర్, వాసునగర్, ముడుమూల్, మురహర్‌దొడ్డి, హిందూపూర్ ప్రాంత రైతులు, ప్రజాప్రతినిధులు సోమవారం నది వద్దకు చేరుకున్నారు. నీటిని అడ్డుగా వేసిన కట్టను తొలగించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న కృష్ణా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రియాజ్ అహ్మద్ రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణస్వామి మాట్లాడుతూ తక్షణమే మన ప్రాంత రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ నివేదికను పంపిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.