సాక్షి, కామారెడ్డి: పిల్లిని బంధించి కొడితే పులిలా మారి తిరగబడుతుందంటారు. కానీ వేట కుక్కలకు భయపడి ఓ చిరుత బేలగా మారి చెట్టెక్కింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపేట అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోతాయిపల్లి, నందివాడ శివారులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆదివారం మధ్యాహ్నం గొర్రెల కాపరులకు చెందిన వేట కుక్కలపైకి ఓ చిరుత దాడికి యత్నించింది. అక్కడే ఉన్న ఎనిమిది వేట కుక్కలు చిరుతపై తిరగబడ్డాయి.
ప్రాణభయంతో చిరుత చెట్టుపైకి ఎక్కింది. కాసేపటి తర్వాత కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చిరుత చెట్టు దిగి అడవిలోకి వెళ్లిపోయింది. పశువుల కాపరులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎల్లారెడ్డి రేంజ్ అధికారి చంద్రకాంత్‌రెడ్డి బేస్ క్యాంపు సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, పోతాయిపల్లి, కోమట్‌పల్లి, నందివాడ, కేశాయిపేట తదితర గ్రామాలకు చెందిన పశువుల కాపరులు, తునికాకు సేకరణ కోసం వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని చంద్రకాంత్‌రెడ్డి సూచించారు.
చదవండి: 21దాకా లాక్‌డౌన్..?
Comments
Please login to add a commentAdd a comment