సాక్షి, ఆదిలాబాద్: పదిహేడవ లోకసభ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి.. అభ్యర్థి బలమా.. పార్టీ ప్రభావమా.. అనేదానిపై ఓటర్లలో ఆసక్తి నెలకొంది. గడిచిన పదహారవ, పదిహేనవ లోకసభ ఎన్నికల నుంచి ఓటింగ్ తీరును పరిశీలిస్తే ఎన్నికకు ఎన్నికకు మధ్య గంపగుత్తగా ఓటింగ్ శాతం మారడం సమీకరణలను స్పష్టం చేస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగియడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరనేది తెలియడంతో ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రభావంపై చర్చ సాగుతోంది.
రెండుచోట్ల త్రిముఖ పోరే..
ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి 2019 లోకసభ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో ఎవరనేది తేలింది. ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది.
ఆదిలాబాద్‌లో ఇలా..
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికల్లో పాత ముఖాలే బరిలో నిలిచాయి. ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే సోయం బాపూరావు ఒక్కరే ఎంపీ స్థానం కోసం మొదటిసారి బరిలో ఉన్నారు. గోడం నగేష్, రాథోడ్ రమేష్ గత ఎన్నికల్లోనూ ప్రత్యర్థులు కావడం గమనార్హం. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్‌జాదవ్ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఇక్కడ 2014 ఎన్నికలను పరిశీలిస్తే.. 75.44 శాతం ఓటింగ్ నమోదు కాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి నగేష్‌కు 41.20 శాతం ఓట్లు లభించడం గమనార్హం. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేష్‌జాదవ్‌కు 24 శాతం, అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న రమేష్ రాథోడ్‌కు 17.61 శాతం ఓట్లు పడ్డాయి.
నగేష్ లక్షా 71,290 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. 2009 ఎన్నికలను పరిశీలిస్తే.. 76.30 శాతం ఓటింగ్ కాగా థర్డ్ ఫ్రంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ బరిలో నిలిచి 43.11 శాతం ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న కోట్నాక్ రమేష్ 29.78 శాతం, అప్పట్లో పీఆర్పీ నుంచి మెస్రం నాగోరావు 13.08 శాతం, బీజేపీ అభ్యర్థి అడె తుకారాం 6.71 శాతం ఓట్లను సాధించారు. ఎన్‌డీఏతో పొత్తు కారణంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి 2009 ఎన్నికల్లో బరిలో నిలువకపోవడం, 2014 ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించడం జరిగింది. దీన్నిబట్టి పార్టీ ప్రభావమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం కావడంతో అభ్యర్థులను బట్టి కూడా ఓటింగ్ ప్రభావం ఉందనేది స్పష్టమవుతోంది.
పెద్దపల్లిలో ఇలా..
పెద్దపల్లిలో ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు ఈ నియోజకవర్గ బరిలో కొత్త ముఖాలు కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి ఎ.చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్.కుమార్, టీఆర్‌ఎస్ నుంచి వెంకటేష్‌నేతకాని బరిలో నిలిచారు. ఇక్కడ మాజీ ఎంపీ జి.వివేకానంద ఈమారు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2009, 2014 ఎన్నికల్లో ఆయన బరిలో ఉన్నారు. ఒకసారి గెలుపొందగా, మరోసారి ఓటమి చెందారు. ఇక 2014 ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒటింగ్ సరళిని పరిశీలిస్తే.. 74.12 శాతం ఓటింగ్ కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు 45.53 శాతం ఓట్లు రావడం గమనార్హం.
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు 17.55 శాతం, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జనపతి శరత్‌బాబుకు 6.2 శాతం ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో 68.72 శాతం ఓటింగ్ కాగా కాంగ్రెస్ నుంచి జి.వివేకానందకు 34.7 శాతం ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న గోమాస శ్రీనివాస్‌కు 29.28 శాతం, పీఆర్పీ నుంచి బరిలో ఉన్న ఆరెపల్లి డెవిడ్‌రాజ్‌కు 19.42 శాతం ఓట్లు పడటం గమనార్హం. అప్పుడు జి.వివేకానంద 49,017 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం జరిగింది.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం.. (2014)
పార్టీ | అభ్యర్థి పేరు | వచ్చిన ఓట్లు |
టీఆర్‌ఎస్ | బాల్క సుమన్ | 4,65,496 |
కాంగ్రెస్ | వివేక్ | 1,74,338 |
టీడీపీ | శరత్‌బాబు | 63,334 |
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం.. (2009)
పార్టీ | అభ్యర్థి పేరు | వచ్చిన ఓట్లు |
కాంగ్రెస్ | జి.వివేక్ | 3,13,748 |
టీఆర్‌ఎస్ | గోమాస శ్రీనివాస్ | 2,64,731 |
పీఆర్పీ | ఆరెపెల్లి డేవిడ్ రాజు | 1,75,605 |
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం.. (2014)
పార్టీ | అభ్యర్థి పేరు | వచ్చిన ఓట్లు |
టీఆర్‌ఎస్ | జి.నగేష్ | 4,30,847 |
కాంగ్రెస్ | నరేష్ జాదవ్ | 2,59,557 |
టీడీపీ | రాథోడ్ రమేష్ | 1,84,198 |
బీఎస్పీ | రాథోడ్ సదాశివ్ | 94,420 |
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం.. (2009)
పార్టీ | అభ్యర్థిపేరు | వచ్చిన ఓట్లు |
టీడీపీ | రాథోడ్ రమేష్ | 3,72,268 |
కాంగ్రెస్ | కోట్నాక్ రమేష్ | 2,57,181 |
పీఆర్పీ | మెస్రం నాగోరావు | 1,12,930 |
బీజేపీ | ఆడె తుకారాం | 57,931 |
Comments
Please login to add a commentAdd a comment