జనసంద్రమైన మల్లన్న సన్నిధి
ఐనవోలు మల్లన్న సన్నిధి భక్తజన సంద్రమైంది.. శివసత్తుల పూనకాలు.. ఒగ్గు పూజారుల కథలు.. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం భోగి పండుగను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజయ్య పూజలు నిర్వహించారు.
- సెంటర్‌స్ప్రెడ్‌లో.. - వర్ధన్నపేట
ఐలోని మల్లన్నకు భక్తుల మొక్కులు భోగి నేపథ్యంలో పెరిగిన రద్దీ కొనసాగుతున్న మల్లికార్జున స్వామి జాతర మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం ఐనవోలు (వర్ధన్నపేట) : ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తజన సంద్రమైంది. భోగి పండుగ నేపథ్యంలో రద్దీ పెరిగింది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఒగ్గు పూజారుల కథ, డప్పు వారుుద్యాల నడుమ నెత్తిన బోనాలతో మహిళలు శివతాండవం చేశారు. రేణుక ఎల్లమ్మకు నైవేద్యం సమర్పించారు. మల్లన్న ఆలయంలో మహిళలు టెంకాయ బందనం చేసి వరంపట్టారు. చిన్న పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. చిన్న పట్నాలు వే శారు. ఒగ్గు కథ (మల్లన్న చరిత్ర)తో స్వామివారిని కొలిచారు. ప్రభుత్వం జాతరను అధికారికంగా గుర్తించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు ఐనవోలుకు చేరుకున్నారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
మల్లన్న సేవలో డిప్యూటీ సీఎం
ఐలవోనిని అధికారిక జాతరగా గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం తాటికొండ
రాజయ్య మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ రాజలింగం, రాజయ్య యాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్ గ ద్దల పద్మ, వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ నల్ల మల్లారెడ్డి, ఎంపీపీ మార్నెని రవీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దేవస్థానం చైర్మన్ వడిచర్ల శ్రీనివాస్, ఈవో శేషుభారతి ఆలయ మర్యాదలతో సత్కరించారు. మామునూర్ డీఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏవీవీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ కొడిమ్యాల శ్రీనివాసరావు నేతృత్వంలో 25 మంది వాలంటీర్లు భక్తులకు సేవలందించారు.
నేటి ఉత్సవాలు..
మహాన్యాస పూర్వక ఏకాద శ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. సాయంత్రం ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకొని గుడిచుట్టు ప్రదక్షిణలు చేస్తాయి.