* ప్యాంట్రీకారునూ మంజూరు చేయలేకుంటే జీఎం ఎందుకని నిలదీత
* బోర్డును రద్దు చేయాలని డిమాండ్
* రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆగ్రహం
* పనికిరాని నిబంధనలతో వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘రైల్లో ప్యాంట్రీకార్‌ను కూడా మంజూరు చేసే అధికారం జనరల్ మేనేజర్‌కు లేదు. ముఖ్య ప్రాంతంలో రైలుకు హాల్ట్ ఏర్పాటు చేయాలంటే ఫైలు ఢిల్లీకి వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ బాగుపడటం సాధ్యమా? మా ప్రతిపాదనలు మేం బతికుండగా కార్యరూపం దాలుస్తాయన్న నమ్మకమే లేదు. దశాబ్దాలపాటు డిమాండ్ చేసినా చిన్నచిన్న పనులకూ దిక్కుండదు. చాయ్ తాగి బిస్కెట్లు తినేందుకే మేం సమావేశాలకు వస్తున్నట్టుగా పరిస్థితి ఉంది’ అంటూ రైల్వేశాఖ పనితీరుపై పార్లమెంటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ బుధవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఎంపీలు ఆగ్రహంతో ఊగిపోయారు.
కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, కొత్త డివిజన్ ఏర్పాటు, రైళ్ల పేరు మార్పు, హాల్టుల కేటాయింపు... లాంటి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉండదని, అలాంటి ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపుతానంటూ జీఎం శ్రీవాస్తవ అందించిన నోట్‌ను చూసిన ఎంపీలు భగ్గుమన్నారు. తాము చేసే ప్రతిపాదనలన్నీ అలాంటివేనని, వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎంకు లేనప్పుడు తాము ప్రతిపాదనలిచ్చి లాభం ఏమిటని ఎంపీలు ప్రశ్నించారు. రైల్వేశాఖ విధానాలను నేరుగా ఎండగట్టారు. రైల్వే విధానాలను సమూలంగా మారిస్తే తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షిగా విరుచుకుపడ్డారు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మరో అడుగు ముందుకేసి రైల్వే బోర్డునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన విధానాలనే అవలంబిస్తూ రైల్వేను నిర్వీర్యం చేస్తున్నారు.
అభివృద్ధి నిరోధకంగా ఉన్న విధానాలను తొలగిస్తానని చెప్పిన ప్రధాని మోదీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త వ్యవస్థ (నీతి ఆయోగ్)ను ఏర్పాటు చేశారు. రైల్వే విషయంలోనూ ప్రధాని అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైల్వే బోర్డును రద్దు చేసి అధికార వికేంద్రీకరణ జరపాలి. స్థానిక అవసరాలపై అవగాహన ఉండే జోనల్ జీఎంకే కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసే అధికారం కేటాయించాలి’ అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే నిబంధనలు అలా ఉన్నాయంటూ జీఎం బదులివ్వగా, అలాంటి పనికిరాని నిబంధనలను మార్చకుంటే రైల్వే శాఖ బాగుపడదని ఎంపీలు పేర్కొన్నారు. దీంతో తానేమీ చేయలేనని జీఎం బదులిచ్చారు. అయితే గతంలో రైల్వే జీఎం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదని, మొదటిసారి తమను పిలిచి అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరించటం అభినందనీయమని ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై స్థానిక ఎంపీలందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో భేటీ ఏర్పాటు చేస్తానని దత్తాత్రేయ ప్రతిపాదించగా రైల్వే బోర్డును రద్దు చేయాలనే తన అభిప్రాయాన్ని ఆ సమావేశంలో లిఖితపూర్వకంగానే ఇస్తానని వినోద్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సహా మొత్తం 19 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కర్ణాటక, మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కూడా ఉన్నారు.
భేటీలో ఎవరేమన్నారంటే..:
దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు సమకూరుతున్న ఆదాయంలో 60 శాతం తెలంగాణ నుంచే వస్తున్నా ఇక్కడ పనులు తక్కువగా జరుగుతున్నాయని ఎంపీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాజీపేటను డివిజన్‌గా ప్రకటించి వ్యాగన్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం-సారపాక, భద్రాచలం-కోవూరులైన్లను పూర్తిచేయాలని, ధంసులాపురంలో ఆర్‌ఓబీ, మధిరలో రెండు ఆర్‌యూబీలు నిర్మించాలని, పాండురంగాపురం రైల్వే స్టేషన్ తరలింపును పరిశీలించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. జమ్మికుంట, కరీంనగర్ స్టేషన్‌లను ఆధునికీకరించాలని ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. తమ ప్రతిపాదనలు తాము బతికుండగా చూస్తామనే నమ్మకం ఉండటం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులకు ఈసారైనా మోక్షం కల్పించాలని, దేవరకద్ర- మునీరాబాద్‌లో మిగిలిన పనిని వెంటనే పూర్తిచేయాల ని మరో ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు.
రైల్వే బోర్డుపై ఎంపీల గుస్సా!
Published Thu, Jan 8 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM
Advertisement
Advertisement