ఖమ్మం క్రైం : మహిళా భద్రతకు భరోసా ఇచ్చేలా నూతన ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తుండడంతో ప్రభుత్వం వారి భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహిళా రక్షణపై సీనియర్ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదికలో సూచనల ఆధారంగా ప్రభుత్వం జిల్లా స్థాయిలో మహిళల భద్రతపై తీసుకునే చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తోంది.
ప్రతి సబ్ డివిజన్‌లో మహిళాపోలీస్ స్టేషన్..
ప్రస్తుతం ఒక్క జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. దీంతో దూర ప్రాంతాల మహిళలు ఇంతదూరం వచ్చి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అయితే ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మహిళ రక్షణ కమిటీ సూచించటంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో ఏడు సబ్ డివిజన్లు ఉండగా ఖమ్మం సబ్ డివిజన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మిగతా ఆరు డివిజన్లతో పాటు ఖమ్మం సబ్ డివిజన్‌లో మరో స్టేషన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు..
మహిళలపై జరుగుతున్న దాడులతోపాటు అఘూయిత్యాలను యుద్ధ ప్రాతిపదికన ఆరికట్టడానికి ఢిల్లీ పోలీసుల తరహాలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి లభించిన తర్వాత మహిళా రక్షక్ విధివిధానాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
మహిళలు, యువతుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి..
మహిళలు, యువతుల అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇల్లెందు, ఖమ్మం, కొత్తగూడెం సబ్ డివిజన్‌లలోని పలు తండాల్లో కొంతకాలంగా మహిళలు, యువతులను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. మహిళా రక్షణ కమిటీ సూచనలతో దీన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
మహిళల వేధించిన ఎన్‌ఆర్‌ఐలనూ వదిలేది లేదు..
వరకట్న వేధింపులతోపాటు, మహిళల పట్ల ఇతర నేరాలకు పాల్పడి విదేశాలలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలను స్వదేశానికి రప్పించాలనే కమిటీ సూచనలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అలాంటి ఎన్‌ఆర్‌ఐల జాబితా సిద్ధం చేయాటానికి సమాయత్తమవుతున్నారు.
విద్యా సంస్థల్లో ప్రత్యేక శిబిరాలు..
మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే కమిటీ సూచన మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించగానే దీనిని ఆచరణలో పెట్టాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠినంగా, నేరగాళ్లకు భయం పుట్టేలా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటంతో పాటు పోలీస్‌శాఖకు సైతం ఆదేశాలు అందాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. కేసు నమోదైన ఒక్క రోజులోనే వారిపై చర్యలు తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భద్రతకు ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకుంటుండడంతో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు భద్రత అవసరం .. - బత్తిన సాయిశ్రీ, వైరా డీఎస్పీ
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం హర్షనీయం. మహిళలు నిర్భయంగా జరిగిన అన్యాయాన్ని తెలియజేసినప్పుడే చట్టాలు వారికి రక్షణగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహిళా భద్రతపై కమిటీ, మహిళలకు వారి వారి స్థానాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఎంతో ఉపయోగపడుతాయి. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి ఇంటి నుంచే మంచి నడువడిక అలవడేలా చూడాలి. సమాజం కూడా మహిళలకు రక్షణగా ఉంటే చట్టాలకు మరింత మద్దతు లభించినట్లు అవుతుంది.
ఆమెకు రక్షణ
Published Tue, Sep 23 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement