పెళ్లైన మూడు రోజులకే వధువు ఆత్మహత్య
ఖమ్మం క్రైం : పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది.. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంనకు చెందిన భాస్కర్‌రావు ఖమ్మంలోని శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు మమతకు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన దోసపాటి గణపతిరావుతో ఈనెల 11నవివాహం జరిగింది.
12న నందిగామలో సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోని అదేరోజు రాత్రి ఖమ్మం వచ్చారు. శనివారం తెల్లవారుజామున మమత ఇంట్లో కనిపించలేదు. కాగా, వెంకటగిరి గేట్ ప్రాంతంలో రైలు కిందపడి ఎవరో మృతి చెందారని స్థానికులు అనుకోవడం విని, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా పట్టాలపై మమత మృతదేహం కనిపించింది.
మమత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావటం లేదని, ఆమె ఇష్టంతోనే ఈ వివాహం చేశామని భాస్కరరావు చెప్పారు. ఇదిలా ఉండగా మమత అత్తారింటికి వెళ్లినప్పుడు దంపతుల మధ్య వివాదం జరిగి ఉంటుందని, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు.