- ప్రతీ జిల్లాకు 15 వేల లీటర్లు
- జనవరి ఒకటో తేదీ నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, శిశువులకు విజయ పాలను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని జిల్లాల్లోనూ దీన్ని అమలుచేస్తారు. ఒక్కో జిల్లాకు సరాసరి 15 వేల లీటర్లు సరఫరా చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ డెయిరీ అధికారులు ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు 200 మిల్లీలీటర్ల వంతున పాలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రమే విజయ డెయిరీ పాలు అందుతున్నాయి.
అనేకచోట్ల వివిధ ప్రైవేటు కంపెనీల పాలు లేదా స్థానికంగా కొని అందజేస్తున్నారు. దీనివల్ల కల్తీ వంటి సంఘటనలు జరిగి కొత్త సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రభుత్వం లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇస్తోంది. ఈ నేపథ్యంలో పాల సేకరణను పెంచి విజయ డెయిరీని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో రాష్ట్రంలో ఉన్న 36 వేల అంగన్ వాడీ కేంద్రాలకు దాదాపు లక్షన్నర లీటర్ల పాలు సరఫరా చేయాల్సిన బాధ్యత విజయ డెయిరీపై ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని అమలుచేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకటో తేదీన ప్రారంభించి... జనవరి నెలాఖరులోగా అన్ని కేంద్రాలకు పాలు సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.