‘మహా’జాగ్రత్తలు ! | officers to take precautions on old files | Sakshi
Sakshi News home page

‘మహా’జాగ్రత్తలు !

Published Thu, May 15 2014 11:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

officers to take precautions on old files

సాక్షి, హైదరాబాద్:  రేపో, మాపో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పక్కకుపెడుతూ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎం డీఏ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల విక్రయాలు, భూ వినియోగ మార్పిడి , భూములు, కాంప్లెక్స్‌ల లీజులు, ఆదాయ-వ్యయాలపై కొత్త ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఎక్కడా దొరక్కుండా ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడ్డాక గత ప్రభుత్వమిచ్చిన జీవోలపై లోతుగా పునఃపరిశీలన జరుపుతామని టీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గతంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల అమలును హెచ్‌ఎండీఏ తాత్కాలికంగా నిలిపేసింది. వీటికి సంబంధించిన ఫైళ్లను మరోసారి లోతుగా పరిశీలించి ఏవైనా తప్పిదాలుంటే సరిదిద్దుకొనే పనిలోపడ్డారు. గతంలో నందగిరిహిల్స్, చందానగర్, నల్లగండ్ల, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలం ద్వారా విక్రయించిన విలువైన భూముల వ్యవహా రాన్ని మళ్లీ తిరగదోడే అవకాశముండడంతో వాటికి సంబంధించిన ఫైళ్లను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కు ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. ఈ స్కీంను కొనసాగిస్తారా..? లేక సమూలంగా మార్పుచేసి మరో పద్ధతిలో ప్రవేశపెడ్తారా..? అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.  

 అక్రమాల పుట్ట : చూసేందుకు పైకి ‘మహా’ గొప్పగా కనిపిస్తున్న హెచ్‌ఎండీఏ అక్రమాలకు నిలయం. ఇందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కొత్త సర్కారు దృష్టిసారిస్తే.. సగంమంది ఉద్యోగులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఇప్పటికే ప్రారంభించిన ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు, ఉప్పల్ భగత్ లేఅవుట్ డెవలప్‌మెంట్, కొత్వాలగూడ ఎకో పార్కు తదితర ప్రాజెక్టుల్లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి..
 కీసర మార్గంలో సుమారు 13 కి.మీ.మేర ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు జరగలేదు. సదరు కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన పలుకుతూ హెచ్‌ఎండీఏ ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో సంస్థపై రూ.100 కోట్లు అదనపు భారం పడింది.  

 సాగర్ ప్రక్షాళనకు ఉద్వాసన పలుకుతారా..? లేక కొనసాగిస్తారా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్న కూకట్‌పల్లి నాలా మళ్లింపునకు పక్కా చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలకు సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చించారు.

 హెచ్‌ఎండీఏకు కామధేను లాంటి ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌లను కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా..? లేక కొనసాగిస్తూ గడువును మరింత పెంచుతుందా..? అన్నది వేచిచూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement