అర్హులకు వారంలో పింఛన్
కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య
హుస్నాబాద్ : అర్హులందరికీ వారంలో పింఛన్లు అందిస్తామని, ఎవరికీ అన్యాయం చేయబోమని, ఇది తన బాధ్యత అని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పేదలకు భరోసా ఇచ్చారు. పింఛన్లు ఎందుకురాలేదో కారణాలు చెబుతామని, దీనిపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. పింఛన్లు నిలిపివేయడంపై పేదలు సోమవారం నుంచి నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విషయం తెల్సిందే. మంగళవారం కలెక్టర్ హుస్నాబాద్‌కు చేరుకుని పేదలతో మాట్లాడారు.
స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. వికలాంగులకు సదరెం సర్టిఫికెట్ లేకున్నా.. వితంతువులకు ధ్రువీకరణపత్రాలు లేకున్నా.. పింఛన్ మంజూరు చేస్తామన్నారు. అవకతవకలకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో చంద్రశేఖర్, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, వైస్‌చైర్మన్ బొలిశెట్టి సుధాకర్, ఎంపీడీవో రాంరెడ్డి, డెప్యూటీ తహశీల్దార్ రాజేందర్‌రావు, నగరపంచాయతీ మేనేజర్ స్వరూపారాణి ఉన్నారు.
నగరపంచాయతీని ముట్టడించిన పేదలు
కలెక్టర్ రాకముందే పేదలకు నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్తగా మంజూరుచేసిన జాబితాలో తమ పేర్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. పింఛన్లు ఇవ్వాలని, ఆర్డీవో రావాలని నినాదాలు చేశారు.
వీరికి కౌన్సిలర్లు దండి లక్ష్మి, చిత్తారి పద్మ, వాల సుప్రజ, పచ్చిమట్ల ప్రతిభ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్, కోమటి సత్యనారాయణ, బొల్లి శ్రీనివాస్, మైదం శెట్టి వీరన్న, గడిపె సింగరి, దొడ్డి శ్రీనివాస్, వరయోగుల అనంతస్వామి, గుత్తికొండ విద్యాసాగర్, కందుకూరి సతీష్, గడిపె మల్లేష్, గుంటిపల్లి దుర్గేశం, దండి కొంరయ్య మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు.