సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఐదు నియోజకవర్గాలకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గానికే అభ్యర్థిని ప్రకటించింది. మధిర నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు టికెట్ ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇక మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. సత్తుపల్లి స్థానాన్ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, ఖమ్మంకు మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఖరారు చేస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక వైరా నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించగా.. ఆ పార్టీలో ఇటీవలే చేరిన డాక్టర్ విజయను అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించింది. అధికారికంగా ఆమె పేరును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది.
ఇక జిల్లాలో కీలక స్థానంగా ఉన్న పాలేరులో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడంతో ఈ సీటుపై ఏర్పడిన ఉత్కంఠ ఇంకా తొలగలేదు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీపడిన ఆశావహులకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి ఈ సీటు కేటాయించడం ఎంతమాత్రం సమంజసం కాదని పలువురు కాంగ్రెస్ నాయకులు తమ వాదనలను ఇటు హైదరాబాద్‌లోనూ.. అటు ఢిల్లీలోనూ మంగళవారం సైతం వినిపించే ప్రయత్నం చేశారు. ఖమ్మం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకుడు మానుకొండ రాధాకిషోర్ చివరి నిమిషం వరకు ఖమ్మం స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినా.. పార్టీ మాత్రం టీడీపీకే ఇవ్వడానికి మొగ్గు చూపినట్లు సమాచారం.
ఇక నామా అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లోని పలు వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరులు మంగళవారం ఖమ్మంలో సమావేశమై అనేక ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పొంగులేటికి టికెట్ ఇవ్వకపోవడం సమంజసం కాదని, ఈ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని కోరారు. పార్టీ ఆదేశాలను జవదాటకుండా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డికి ఖమ్మం టికెట్ కేటాయించే విషయంపై పార్టీ ఆలోచించాలని వారు కోరారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వద్దిరాజు రవిచంద్రకు టికెట్ లభించకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిర్వేదంలో ఉన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో రవిచంద్ర అనుచరులతో సమావేశం అవుతారని ప్రచారం జరుగుతుండగా.. టికెట్ ఆశించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు సామాజిక సమతూకం పాటించలేదన్న భావనను పార్టీ అంతర్గత సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
వైరాలో అసమ్మతి సెగలు..
ఇక వైరా నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌లో అస మ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఈ సీటును గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించగా.. మళ్లీ సీపీఐకే కేటాయించడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రె‹ Ü శ్రేణులు, నేతలు పలువురు భగ్గుమంటున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ పోలీస్ అధికారి రాములునాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఒత్తిడి తెస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పాలేరులో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఖరారు చేస్తుందనే అంశం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. పాలేరు అభ్యర్థి గా కందాల ఉపేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైం దని ప్రచారం జరుగుతున్నా.. ఈ సీటుపై మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పట్టు వీడకపోవడం తో దీనిని కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థులుగా ఖరారైన నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఒకటి, రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మధిర అభ్యర్థిగా అధికారికంగా ఖరారు కావడంతో రెండు, మూడురోజుల్లో ఆయన సైతం నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచం ద్రకు సమీప జిల్లా అయిన వరంగల్‌లో సీటు సర్దుబాటు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన అనుచరవర్గం వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది.
ఖమ్మం నుంచి మహాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లాకు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీశ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకుం టున్నాయి. పార్టీ తన పేరు ఖమ్మం నియోజకవర్గానికి అధికారికంగా ఖరారు చేసేంత వరకు తన అంతరంగాన్ని వెలిబుచ్చకుండా వేచిచూసే ధోరణి అవలంబించిన నామా.. నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సైతం కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ సామాజిక వర్గానికి ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా లభించకపోవడం, జిల్లాలో పలు స్థానాల అభ్యర్థులను ఎంపిక చేయడంలో సరైన రీతిలో వ్యవహరించలేదని తనను కలిసిన జిల్లా నేతలతో అభిప్రాయపడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఉమ్మడి జిల్లాలో టీడీపీ అశ్వారావుపేట నియోజకవర్గంలో.. కాంగ్రెస్ కొత్తగూడెం నియోజకవర్గంలో.. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించింది. కేవలం ఇల్లెందులో కాంగ్రెస్ ఆశావహుల మధ్య అత్యంత పోటీ నెలకొనడంతో టికెట్ ఎవరికి ఖరారు చేయాలనే అంశంపై ఎటూ తేల్చుకోలేక పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు 15 లేదా 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న పాలేరు అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ బుధవారం నాటికి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎదుర్కొనే దీటైన వ్యక్తి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇందుకోసమే సీటును పెండింగ్‌లో పెట్టార ని పుకార్లు షికార్లు చేస్తున్నా.. ఈ సీటు కందాల ఉపేందర్‌రెడ్డికే దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment