రికార్డ్ టూర్
⇒జిల్లాలోనే వరుసగా నాలుగు రోజులు
⇒మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
⇒ఆరు బస్తీలు మోడల్ కాలనీలుగా అభివృద్ధి
⇒టెక్స్‌టైల్ పార్క్‌పై స్పష్టత
⇒3,917 ఇళ్లకు రూ.400 కోట్లు మంజూరు
⇒పింఛన్లు, కార్డుల పంపిణీపై ఆదేశాలు
⇒వచ్చే పర్యటనలో జిల్లా మొత్తంపై దృష్టి
⇒ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా చరిత్రలో వరుసగా నాలుగు రోజులు ముఖ్యమంత్రి ఉండడం అనేది జరగలేదు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దీన్ని చేసి చూపించారు. జిల్లా కేంద్రం సమగ్ర అభివృద్ధి ప్రణాళికే లక్ష్యంగా కేసీఆర్ నాలుగు రోజుల పర్యటన సాగింది. క్షేత్రస్థాయి పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం, వాటికి తగినట్లు అక్కడే నిర్ణయాలు తీసుకోవడం, అధికారులు వెంటనే అమలు చేసేలా చూడడం.. చివరగా తన నిర్ణయాలు అమలు చేసి చూపించారు.
సీఎం కేసీఆర్.. గురువారం సాయంత్రం ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చారు. వస్తూ వస్తూనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్ మురికికాలనీలను సందర్శించారు. స్వయంగా పేదలకు ఇళ్లకు వెళ్లి వారి అవసరాలు తెలుసుకున్నారు. అధికారుల చర్యలతో అర్హులకు సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డులు రాకపోవడం సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. బస్తీల్లో పేదల దయనీయ పరిస్థితి చూసి చలించిపోయారు. ఐదు నెలల్లోపు అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తానని ప్రకటించారు.
క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్న కేసీఆర్ వెంటనే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇచ్చే వరకు వరంగల్ విడిచి వెళ్లనని ప్రకటించారు. మొదట నగర పరిస్థితిని చూపి వరంగల్ కమిషనర్ జి.సువర్ణపండాదాస్‌పై, సామాజిక పింఛన్ల, రేషన్‌కార్డుల పంపిణీపై కలెక్టర్ జి.కిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన లక్ష్యాలు వారికి స్పష్టంగా వివరించి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇలా ఆదేశాలు అమలు చేసేలా యంత్రాంగాన్ని ఆదేశిస్తూనే.. శుక్రవారం, శనివారం బస్తీల్లో పర్యటించారు. గురువారం, శుక్రవారం పర్యటించిన బస్తీల్లో సర్వే పూర్తి చేసి అర్హులైన 3,957 డబుల్ బెడ్ రూం(వన్ ప్లస్ వన్) ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ప్రకటన ఆచరణలో వచ్చేలా నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయి యంత్రాంగాన్ని జిల్లాకు రప్పించారు. అన్నింటికీ అనుమతులు జారీ చేశారు. ఆదివారం ఆరు బస్తీల్లో మోడల్ కాలనీలకు శంకుస్థాపన చేశారు.
నాలుగేళ్లలోపు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్‌కార్డులు అందేలా చూసే బాధ్యతను అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, కొండా సురేఖలకు అప్పగించారు. శనివారం పర్యటించిన వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని బస్తీల్లో మోడల్ కాలనీల నిర్మాణానికి ఎనిమిది రోజుల్లో వచ్చి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. ఈ బస్తీల్లో సర్వే బాధ్యతలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డిలకు అప్పగించారు.
మురికివాడలు, పింఛన్లు, రేషన్‌కార్డులతోపాటు.. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి తాను మళ్లీ జిల్లాకు వచ్చేలోపు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. భూపాలపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక సమీక్ష జరిపి ఆ ప్రాంత అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పరిశ్రమ ఏర్పాటు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. నాలుగు రోజుల పర్యటనతో ఆగిపోకుండా.. ఎనిమిది రోజుల్లోపు వస్తానని చెప్పారు. దీంతో వరంగల్ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు దీర్ఘకాలిక లక్ష్యం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
పర్యటనపై నేతలతో చర్చలు
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన వెనుక ప్రధానంగా మూడు లక్ష్యాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిపాలనను వేగవంతం చేయడం, ప్రభుత్వ యంత్రాంగం కారణంగా విమర్శలు ఎదుర్కొన్న పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీపై పేదలకు భరోసా ఇవ్వడం, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం.. ఈ నగరంలో మేయర్ స్థానం దక్కించుకోవడం లక్ష్యాలుగా సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా తాను ఎక్కడ ఉన్నా పరిపాలపై ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన రాష్ట్ర స్థాయి అధికారులను వరంగల్‌కు రప్పించారు.
వరంగల్‌కు సంబంధించి తాను తీసుకనే నిర్ణయాలపై ప్రజల స్పందన ఎలా ఉందనే విషయాన్ని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకుల వద్ద అడిగి తెలుసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఇంటికి తేనేటి విందుకు వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలతో ఇదే అంశంపై చర్చించారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి కాపోవడంతో వరంగల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి గట్టి పట్టున్న జిల్లా కావడంతో వరంగల్ మేయర్ పదవిని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు.
వరంగల్ నగరం పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని బస్తీల్లో పర్యటించి నగరంలోని అన్ని వర్గాల ప్రజల్లో అభివృద్ధి అంశంపై చర్చకు తెరతీశారు. పరిశీలించడంతోనే ఆగకుండా రెండు రోజుల్లోనే కాలనీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాలతో వరంగల్ నగరం ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత పెంచిందని టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇది వచ్చే ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.