చంద్రశేఖర్‌కాలనీ : జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయం లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు ఊపందుకున్నాయి. గతనెల 30వ తేదీ నుంచి ఈనెల 17 వరకు అంటే దాదాపు ఇరవై రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు తెలంగాణ పది జిల్లాలో ఎక్కడా కూడా జరగలేదు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు స్టేట్(టీఎస్) సిరీస్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్ర శివారులోని నాగారం వద్ద గల జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో బుధవారం నుంచి అన్నిరకాల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు టీఎస్ 16 సిరీస్‌పై చేయడం అధికారులు ఆరంభించారు.
బుధవారం 45 వాహనాల రిజిస్ట్రేషన్‌లు కాగా, గురువారం 157 వాహనాల రిజిస్ట్రేషన్‌లు జరిగా యి. దాదాపు 20 రోజుల నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయడంతో జిల్లాలో దాదాపు 1,500 వరకు ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాల వాహనాల రిజిస్ట్రేషన్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా గురువారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా ఉప రవాణా కార్యాలయం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌దారులతో కిటకిటలాడింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొత్త వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను ఆర్టీఏ సిబ్బంది స్వీకరించా రు.
భోజన విరామ సమయాన్ని ఉపయోగించుకోకుండా సాయంత్రం 4 గంటల వరకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ల దరఖాస్తుల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. శుక్రవారం పెద్దమొత్తంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. తిరిగి సోమవారం నుంచి వారం లోగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లన్నింటిని పూర్తి చేసేవిధంగా డీటీసీ రాజారత్నం చర్యలు చేపట్టారు.
జోరందుకున్న రిజిస్ట్రేషన్‌లు
Published Fri, Jun 20 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM
Advertisement
Advertisement