‘అద్దె’కు బస్‌భవన్!
- సినిమా షూటింగులకు కేటాయిస్తున్న ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: అప్పుల ఊబిలో మునిగిపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు సినిమా షూటింగులను నమ్ముకుంటున్నారనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా లాభా లు రావటం కాదుకదా... కనీసం నష్టాలను తగ్గించలేకపోతుండటంతో ఏదో ఒక రూపంలో నాలుగు రాళ్లు కూడగట్టేందుకు సినిమా షూటింగులే మంచి మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌ను సినిమా షూటింగులకు అద్దెకిచ్చారు.
బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఓ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ తో బస్‌భవన్ బిజీగా మారిపోయింది. కొద్దిరోజుల కిందటే ఈ సినిమాకు సంబంధించి ప్రధాన ఘట్టాలను వరసగా నాలుగు రోజులపాటు నిరంతరాయంగా బస్‌భవన్‌లో చిత్రీకరించారు. తాజాగా సోమవారం మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గతంలో పనివేళల్లో షూటింగ్ జరగటంతో ఉద్యోగులు విధులు మానేసి మరీ షూటింగ్ చూసేందుకు ఎగబడ్డారు. దీంతో చెడ్డ పేరు వస్తుందని భావించిన అధికారులు సోమవారం నాటి షూటింగ్ కోసం పని వేళ ముగిశాక అనుమతిచ్చారు.
దీంతో సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు షూటింగ్ జరిగింది. అయినా సినిమా యూనిట్ సిబ్బంది మధ్యాహ్నమే బస్‌భవన్‌కు చేరుకుని వంట కార్యక్రమం మొదలుపెట్టారు. షూటింగ్ కోసం రోజుకు రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. కార్పొరేట్ కార్యాలయం రూపుతోపాటు ఫ్లోర్లు విశాలంగా ఉండటంతో షూటింగులకు ఆ భవనం అనుకూలంగా ఉందని సినిమా యూనిట్లు భావిస్తున్నాయి.
ఎలాంటి సెట్టింగ్‌కు అయినా అనుకూల వాతావరణం ఉండటంతో మరికొన్ని సినిమాలను కూడా అక్కడ షూట్ చేసుకునేందుకు అనుమతులు కోరుతున్నట్టు తెలిసింది. దీంతో రోజువారీ చార్జీని రూ. లక్షకు పెంచాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. అయితే షూటింగుల వల్ల కార్యాలయంలో రోజువారు పనులకు అవాంతరం ఎదురవుతోంద న్న ఫిర్యాదులు వస్తున్నాయి.