![Sakshi Personal Interview with MLC Balasani Lakshmi Narayana](/styles/webp/s3/article_images/2019/07/21/mlc%20copy.jpg.webp?itok=EONpuaQT)
మనుమరాళ్లతో బాలసాని దంపతులు
‘ఏమాత్రం అవకాశం ఉన్నా అరక దున్నడానికి, దుగాలు చేయడానికి, అచ్చు తోలడానికి ఇష్టపడతా. వ్యవసాయ కుటుంబం కావడంతో ఇవన్నీ చిన్నతనం నుంచే తెలుసు. నిబద్ధతతో పనిచేసి ప్రజలతో మమేకమైతే రాజకీయాల్లో అవకాశాలకు కొదవ ఉండదు. దీనికి నా రాజకీయ జీవితమే ఉదాహరణ. హలంపట్టి పొలందున్నిన రైతుగా.. సహకార రంగం ద్వారా తోటి రైతులకు సేవచేసే మహోన్నత అవకాశం లభించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి’ అంటున్న శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణతో ఈ వారం పర్సనల్ టైం.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మారుమూల గిరిజన ప్రాంతమైన వెంకటాపురం మండలం మరికాల మా సొంతూరు. వ్యవసాయం తప్ప మరే వ్యాపకం తెలియని కుటుంబం మాది. నాన్న సన్యాసయ్య, అమ్మ రత్తమ్మ, అన్న ముత్తయ్య, నేను. మాకు మరికాల పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం లభించడం ఇప్పటికి మా కుటుంబం అదృష్టంగా భావిస్తోంది. రైతులకు వ్యవసాయపరంగా చేయూతనిచ్చేందుకు డీసీసీబీ అధ్యక్షుడిగా, డీసీఎంఎస్ చైర్మన్‌గా అవకాశం లభించింది. మాది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. ఐదుగురం అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. నాన్న మరణించేంత వరకు కుటుంబ ఆలనాపాలనా మా ఆర్థిక అవసరాలు ఆయనే చూసుకునేవారు. ఇంటి పెద్దగా నాన్నంటే ఎంత గౌరవమో.. అంత భయం. రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది దివంగత ముఖ్యమంతి ఎన్‌టీ.రామారావే. నా పట్ల ఆయనకు ప్రత్యేకమైన అభిమానం, ఆదరణ ఉండేది. అందుకే ఆయన నుంచి విడివడి చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో చేరడానికి అనేకసార్లు ఆలోచించా.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతోనే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీలో చేరా. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరే ఉద్దేశం కొంత లేకున్నా.. తుమ్మల ప్రోత్సాహంతోనే టీఆర్‌ఎస్‌లోకి వచ్చా. 1987లో మరికాల పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన క్రమంలో డీసీసీబీ ఎన్నికల్లో పోట్ల మధుసూదన్‌రావును టీడీపీ తరఫున గెలిపించుకోవడం కోసం మిత్రపక్షాల తరఫున తెల్దారుపల్లిలో శిబిరం నిర్వహించారు. అది ఎప్పటికీ మరచిపోలేనిది. తెల్దారుపల్లిలో ప్రతి ఇంటికి నలుగురు సొసైటీ అధ్యక్షులను అప్పగించి పది రోజులపాటు క్యాంప్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనే డీసీఎంఎస్ డైరెక్టర్‌గా బీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించింది. వాస్తవంగా డీసీఎంఎస్ చైర్మన్ పదవిని చర్ల మండలం తేగడకు చెందిన సంజీవరెడ్డికి ఇచ్చేందుకు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. అయితే ఆయన ఓడిపోవడం, బీసీ కోటాలో డీసీఎంఎస్ డైరెక్టర్‌గా నేను ఎన్నికవడంతో భద్రాచలం ప్రాంతంలో 20 మంది పీఏసీఎస్ సభ్యులున్నందున ఆ పదవి నాకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో డీసీఎంఎస్ అధ్యక్షుడినయ్యా.
వ్యవసాయం అంటే ప్రాణం..
వ్యవసాయం అంటే నాకు ప్రాణం.. అందుకే సహకార సంఘం ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని రైతుల కోసం వినియోగించా. 1990లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై సుదీర్ఘకాలం కొనసాగా. టీడీపీ, టీఆర్‌ఎస్.. ఎందులో ఉన్నా.. అన్ని పార్టీల నేతలకు స్నేహితుడిగా, సన్నిహితుడిగా ఉండగలగడం ఆనందంగా ఉంది. 1995లో డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నిక కావడానికి తొలిసారిగా నా సొంత వ్యూహాన్ని అమలుపరిచా. కాంగ్రెస్‌లోని కొందరి పెద్దలతోపాటు ఆ పార్టీ్కి చెందిన అభ్యర్థి పోటీ విరమించుకోవడంతో నా ఎన్నిక ఏకగ్రీవమైంది. డీసీసీబీ అధ్యక్షుడిగా కావడానికి మంత్రి తుమ్మలతోపాటు పువ్వాడ నాగేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం, బోడేపూడి వెంకటేశ్వరరావు, కోనేరు నాగేశ్వరరావు సహకరించారు. తొమ్మిదేళ్లపాటు డీసీసీబీ చైర్మన్‌గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంతోపాటు ఖమ్మం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసేందుకు రెండుసార్లు అవకాశం లభించింది. స్వల్ప తేడాతో ఓటమి చెందినా నిరంతరం ప్రజల మధ్యన ఉండడంతో అదే పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది.
ఇప్పటికీ ఏమాత్రం అవకాశం ఉన్నా అరక దున్నడానికి ఇష్టపడతా. ఉమ్మడి కుటుంబం కావడంతో వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం తక్కువే. రాజకీయ జీవితంలో నేను బిజీగా ఉండడంతో కుటుంబ విషయాలను, పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత నా సతీమణి సామ్రాజ్యం తీసుకునేది. ఆవిడకు అత్యంత సహనం. పిల్లలకు నేను సమయం ఇవ్వలేకపోయినా.. వారికి కారణాలు వివరించి నచ్చచెప్పేది. పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు కలిసి సినిమా చూసిందే లేదు. విహార యాత్రలు మా ఇంటా.. వంటా లేవు. ఎవరికి ఏమాత్రం సమయం ఉన్నా పొలం పనులమీద దృష్టి సారించడమే. నాకు ఇద్దరు కుమారులు. విజయ్‌కుమార్ కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డాడు. వినోద్‌కుమార్ ఇటీవల సింగపూర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. కూతురు సంధ్య ముంబైలో ఉంటుంది.
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు, నాన్న సన్యాసయ్య చనిపోయినప్పుడు అత్యంత బాధపడ్డా. నాకు ఒకరు రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తే.. మరొకరు జన్మను ప్రసాదించడం ఇందుకు కారణం. ఇక 1995లో డీసీసీబీ చైర్మన్‌గా నేను ప్రయత్నం చేయాలని సంకల్పించి.. మరికాల నుంచి అనుకున్నదే తడవుగా హైదరాబాద్ బయలుదేరా. ఆరోజు అమావాస్య అట. ఈ విషయం తెలిసి నాన్న చాలా ఆందోళన చెందాడు. ఒక ముఖ్యమైన పనికి తిధి, వర్జ్యం చూసుకోకుండా వెళ్లాడు.. ఎమవుతుందో.. ఏమో అని కలత చెందాడట. ఈ విషయం అమ్మ నాతో చెప్పి ఆందోళన చెందింది. ఆ అమావాస్యే నాకు కలిసొచ్చింది. డీసీసీబీ చైర్మన్ పదవి ఎన్టీఆర్ ఆశీస్సులతో అప్పటి రాజకీయ హేమాహేమీలను కాదని నాకు దక్కింది. ఇక డీసీసీబీ చైర్మన్ పదవి నాకు ఖారారు అయిన తర్వాత బాధ్యతలు తీసుకోవడానికి నేను వెనకా ముందు ఆలోచిస్తుంటే అప్పటి టీడీపీ నాయకులు బోళ్ల వెంకటేశ్వర్లు రాజకీయాల్లో ఆలస్యం అమృతం.. విషం లాంటిది తక్షణమే బాధ్యతలు చేపట్టమన్నారు.
ఆగస్టు 10వ తేదీన నేను బాధ్యతలు చేపట్టా. అయితే ఆరోజు కూడా అమావాస్యే అని ఆయన చమత్కరించారు. నా సంకల్ప బలానికి తిధి, వారాలు సైతం సహకారం అందించాయి. వెంకటాపురం నుంచి జనారణ్యంలోకి రావాలంటే మేము పడ్డ బాధ వర్ణనాతీతం. వరదల సమయంలో మా ఊరి నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉన్న భద్రాచలం నడిచి వచ్చిన సమయం కోకొల్లలు. సైకిళ్లపై ప్రయాణం సైతం చేశాం. మాది పెద్ద వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కావు. అయితే నాన్న మాకు ఎప్పటికప్పుడు డబ్బు విలువ చెబుతుండేవారు.
Comments
Please login to add a commentAdd a comment