సాక్షి, కొత్తగూడెం: సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కోలిండియాలో కనీస వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడ విస్మరించడంపై కార్మికులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో 2012లో జరిగిన ‘హైపవర్’ ఒప్పందానికి నేటికీ సింగరేణిలో మోక్షం కలగని దుస్థితి నెలకొంది.
రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు అనే మాటే ఉండదని అందరినీ రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో కూడా క్రమబద్ధీకరణపై హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక ఏళ్లుగా కనీస వేతనాలు సైతం లేకుండా వెట్టిచాకిరి చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. క్రమబద్ధీకరణ విషయం పక్కనబెడితే.. కనీస వేతనాల అమలులో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కోలిండియాలో హైపవర్ కమిటీ వేతనాల చెల్లింపు అమలు అవుతున్నప్పటికీ సింగరేణిలో మాత్రం ఆ ఊసే లేదు. హైపవర్ వేతనాలు చెల్లించేందుకు 2012 సెప్టెంబరు 9న ఒప్పందం జరిగింది. ప్రకృతి విరుద్ధంగా గనుల్లో కాలుష్య వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని హైపవర్ వేతన కమిటీ సూచించింది. ఈ మేరకు వేతనాలను చెల్లించకపోవడం దారుణమని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
25,367 మందికాంట్రాక్ ్ట కార్మికులు
అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ సింగరేణి పురోగతిలో ఉందంటే అందులో కాంట్రాక్ట్ కార్మికులదే కీలక పాత్ర. సింగరేణి వ్యాప్తంగా 24,747 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఏరియాలో 905 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,379, మణుగూరులో 1,604, ఇల్లెందులో 740, భూపాలపల్లిలో 1,109, రామగుండం–1లో 1,583, రామగుండం–2లో 1,875, రామగుండం–3లో 1,759, శ్రీరాంపూర్‌లో 1,486, మందమర్రిలో 1,126, బెల్లంపల్లిలో 2,151, అడ్రియాల లాంగ్‌వాల్ వద్ద 560, జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 2,470 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కోల్ ట్రాన్స్‌పోర్ట్, లోడింగ్, అన్‌లోడింగ్, సులభ్ కాంప్లెక్స్ లలో మరో 5,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. నర్సరీల్లో 270 మంది, కన్వేయన్స్ డ్రైవర్లు 350 మంది ఉన్నారు. సింగరేణిలో ప్రకృతి విరుద్ధ వాతావరణంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులతో పాటు సమానంగా కష్టపడుతున్నప్పటికీ వారిని రెండోతరగతి పౌరులుగా గుర్తిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. అలాగే రక్షణకు సంబంధించిన పరికరాలు సైతం వీరికి ఇవ్వని దుస్థితి నెలకొంది. ఎండాకాలంలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసే తమకు కనీసం మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోతున్న కార్మికులు
2012లో జరిగిన 9వ వేతన సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు కోలిండియా పరిధిలోని కోల్‌కారిడార్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే కోలిండియా పరిధిలోని బొగ్గు పరిశ్రమలు ఆ మేరకు చెల్లిస్తున్నాయి. కానీ సింగరేణిలో మాత్రం చెల్లించటం లేదు. ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సింగరేణి యాజామాన్యం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలి.
ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు అన్నెబోయిన వెంకన్నపీఎఫ్ వర్తింపజేయాలి
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సింగరేణిలో కొన్ని విభాగాల్లో అమలు చేయడం లేదు. ప్రధానంగా నర్సరీ, సులభ్‌కాంప్లెక్స్, కన్వేయన్స్, కోల్ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగాల్లో కనీస వేతనం అమలు చేయడం లేదు. ఉదయం నుంచి రాత్రివరకు వచ్చే లారీలను ఎక్కి వాటిలో ఉన్న బొగ్గు హెచ్చుతగ్గులను సరిచేస్తూ సంస్థకు ఆర్థికంగా ఉపయోగపడే కార్మికులకు కనీసం పీఎఫ్ వర్తింపజేయకపోవడం దారుణం.– సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (ఇఫ్టూ)రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమెళ్ల సంజీవ్
Comments
Please login to add a commentAdd a comment