గంభీరావుపేట : నెత్తికి రుమాలు.. చేతిలో సంచితో కనిపిస్తున్న ఇతని పేరు మోతె శివయ్య. ఊరు గంభీరావుపేట మండలం లింగన్నపేట. అక్షరం రాని అమాయకుడు.. లంచం అడిగిన అధికారిని ఏసీబీ అధికారులకు పట్టించిన అసామాన్యుడు... అందుకే అందరూ శెభాష్ అంటున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని పొలం పనులు చేసుకునే శివయ్య పేద రైతు. వీఆర్వో అడిగిన లంచం డబ్బులు ఇవ్వడానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఏసీబీని ఆశ్రయించాడు. అధికారి ఆటకట్టించాడు.
శివయ్యకు లింగన్నపేటలో రెండెకరాల పొలం ఉంది. అప్పొసప్పో చేసి ఆక్టోబర్ 2014లో అదే గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర 22గుంటల పొలం కొనుక్కున్నాడు. కొన్న పొలంను తన పట్టాదారు పాస్‌పుస్తకంలో రాయించుకోవాలని మీ సేవలో దరఖాస్తు చేసుకొని వీఆర్వో మల్లయ్యను కలిశాడు. ఆయన రూ.3వేలు లంచం డిమాండ్ చేశాడు. అసలే పేద రైతు.. కష్టపడి పొలంలో పని చేసుకునే కర్షకుడు.. డబ్బులు తన దగ్గర లేవు. ఏం చేయాలో తోచక.. సన్నిహితుల సహకారంతో ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రూ.3 వేలు ఇస్తూ వీర్వోను ఏసీబీ అధికారులకు పట్టించాడు. ‘మునుపు పొలం కొన్నపుడు కూడా రూ.3వేలు ఇచ్చిన. మొన్న అరెకరం పొలం కొన్న. దానిని పట్టాలో రాయమంటే మళ్లీ రూ.3వేలు ఇయ్యమన్నడు. నేను పేదోణ్ణి. గన్ని పైసలు ఎట్లిచ్చేది. ఎన్నిసార్లు తిరిగినా.. ఎంత బతిమిలాడిన వినలేదు. గంతే ఏసీబీ అధికారులను కలిసిన’.