తెలంగాణలో పరిశ్రమలు పెట్టండి | start indusrties in telangana, harish rao to vaysha industrialists | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పరిశ్రమలు పెట్టండి

Published Sat, Jul 18 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన అంతర్జాతీయ వైశ్య సదస్సు రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, టీజీ వెంకటేశ్‌ల ఆలింగనం

శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన అంతర్జాతీయ వైశ్య సదస్సు రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, టీజీ వెంకటేశ్‌ల ఆలింగనం

- వైశ్య పారిశ్రామికవేత్తలకు మంత్రి హరీశ్‌రావు పిలుపు
-  ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్: గ్రంథి మల్లికార్జునరావు
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ వైశ్య సదస్సు ప్రారంభం
 
హైదరాబాద్:
తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాల్సిందిగా వైశ్య పారిశ్రామికవేత్తలకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ వైశ్య సదస్సు(ఐవీఎఫ్) రెండో వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులూ ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని, పైగా రాష్ట్రంలో విద్యుత్ కోతలనే సమస్యే లేదని గుర్తు చేశారు. అగ్ర వర్ణాల్లోనూ పేదలున్నారని, వారి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైశ్యులంతా ఒకే గొడుగు కిందకు రావాలని సూచించారు. ప్రభుత్వాలు గుర్తించాలంటే ఐక్యత ముఖ్యమన్నారు.

‘‘నేను మంత్రి అయిన రెండో రోజే అసెంబ్లీలో పలు ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలు విని అప్పటి  మంత్రి రోశయ్య శభాష్ అంటూ ఆయనిచ్చిన కితాబును ఎప్పటికీ మరువలేనిది. ఆ సంఘటన నాలో ఎంతో ఆత్మ విశ్వాసం నింపింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు. జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ రానున్న దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకనుగుణంగా వ్యాపారాలను మార్చుకోవాల్సిన అవసరముందన్నారు.



వైశ్యుల ఐక్యతకు ఐవీఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వైశ్యులు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అన్నారు. దేశం ముందున్న సవాళ్లను అర్థం చేసుకొని ముందుకు సాగాల్సి ఉందని వైశ్యా బ్యాంక్ మాజీ చైర్మన్ రమేశ్ గెల్లి అన్నారు. దేశంలోని వైశ్యులను ఏకం చేసేందుకు ఐవీఎఫ్‌ను ఏర్పాటు చేశామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్ అగర్వాల్ అన్నారు. 2015 సివిల్స్ టాపర్ ఇరా సింఘాల్, మూడో ర్యాంకర్ నిధి గుప్తలకు ఈ సందర్భంగా రూ.లక్ష చొప్పున చెక్కులు అందించి సన్మానించారు.

కార్యక్రమంలో ఐవీఎఫ్ ప్రధాన కార్యదర్శి గంజి రాజమౌళి, ఉపాధ్యక్షుడు గంజి ప్రవీణ్ కుమార్, గౌరిశెట్టి చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, రాష్ట్ర నేతలు ముత్యాల సత్తయ్య, శ్రీధర్, పీఎస్‌ఆర్ మూర్తి, పురుషోత్తం, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement