విద్యార్థులకు పరీక్షల ఓఎంఆర్ కాపీ | Students copy of the exam gap | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పరీక్షల ఓఎంఆర్ కాపీ

Published Fri, Mar 11 2016 12:47 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

విద్యార్థులకు పరీక్షల ఓఎంఆర్ కాపీ - Sakshi

విద్యార్థులకు పరీక్షల ఓఎంఆర్ కాపీ

ఎంసెట్, ఐసెట్, పీజీ ఈసెట్‌లలో అమలు
పరీక్ష రాశాక ఓఎంఆర్ కార్బన్‌లెస్ కాపీ తీసుకెళ్లే సౌలభ్యం

 
హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్, పీజీ ఈసెట్‌లలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రవేశ పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు వారి ఓఎంఆర్ జవాబుల పత్రం ప్రతి (కార్బన్‌లెస్ కాపీ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన సెట్స్ హైపవర్ కమిటీ గురువారం వెల్లడించింది. 2016 మే 2న జరిగే ఎంసెట్‌తోపాటు ఐసెట్, పీజీ ఈసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో 1+1 ఓఎంఆర్ జవాబు పత్రాల విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఓఎంఆర్ జవాబు పత్రంలో జవాబులు రాసినప్పుడు (బబుల్  చేసినప్పుడు) దాని కిందే ఉండే మరో ఓఎంఆర్ జవాబు పత్రం (కార్బన్‌లెస్ కాపీ)పైనా బబుల్ ముద్ర పడుతుంది. పరీక్ష పూర్తయ్యాక విద్యార్థి ఒరిజినల్ ఓఎంఆర్ షీటును ఇన్విజిలేటర్‌కు ఇచ్చి కిందనున్న కార్బన్‌లెస్ కాపీని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. దీంతో తాము ఏయే ప్రశ్నలకు ఎటువంటి జవాబులు రాశామో విద్యార్థులకు స్పష్టత ఉంటుంది. అలాగే పరీక్షల ‘కీ’ ప్రకటించాక జవాబులను సరిచూసుకోవడం సుల భమవుతుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల విధానంలో తెస్తున్న సంస్కరణల్లో భాగంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీని విద్యార్థులకు అందించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.
 
అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ బయోమెట్రిక్

వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు 2016లో నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని హైపవర్ కమిటీ నిర్ణయించింది. పరీక్ష సమయంలో విద్యార్థుల వేలి ముద్రలు సేకరించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాల కౌన్సెలింగ్ సమయంలో వాటిని పోల్చి చూడనుంది. అలాగే యూనివర్సిటీలు/ విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే సమయంలోనూ పరీక్ష సందర్భంగా తీసుకున్న వేలిముద్రలతో సరిచూసుకోవాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్/స్కాలర్‌షిప్‌ల మంజూరుకూ ఈ సమాచారాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. వీటితోపాటు పీజీ ఈసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.
 
మెడికల్‌కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్షలు
 ఎంసెట్ దరఖాస్తుల గడువు ముగిసేనాటికి అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఈసారి లక్ష దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని తొలుత భావించినా లక్ష మందికి ఒకేసారి నిర్వహించడం అసాధ్యమన్న భావనకు వచ్చారు. అందుకే ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్  పరీక్షను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాస్తారా? ఆన్‌లైన్ పరీక్ష రాస్తారా? అన్నది విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం కల్పించనున్నారు. అయితే ఆన్‌లైన్ పరీక్ష హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో పరీక్షను ఒకే సమయంలో నిర్వహిస్తారు. అలాగే పేపర్‌లలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఆన్‌లైన్‌లో గరిష్టంగా 25 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇంజనీరింగ్ కంటే మెడికల్‌కు ఎక్కువ

 ఇప్పటివరకు ఇంజనీరింగ్ కంటే అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులోనూ బాలికలే ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. ఈ రెండింటికి గురువారం వరకు 48,771 మంది దరఖాస్తు చేసుకున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement