సాక్షి ప్రతినిధి, వరంగల్ : గతమెంతో ఘనం... ఇప్పుడు దయనీయం... ఇదీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. గ్రామస్థాయిలో పటిష్టమైన కేడర్‌తో జిల్లాలో బలం చాటుకున్న టీడీపీకి గడ్డు రోజులొచ్చారుు. తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని దుస్థితి ఆ పార్టీలో నెలకొంది. మునిసిపల్, స్థానిక ఎన్నికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు. సాధారణ ఎన్నికల తరుణంలో అన్ని సీట్లలో టికెట్ల కోసం పోటీ ఉండడం పరిపాటి.
ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలు సైతం పోటీ నుంచి తప్పుకునేందుకు కారణాలు వెతుక్కుంటున్నారు. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీల్లో మొత్తం 116 వార్డులుండగా... టీడీపీ కేవలం 75 స్థానాల్లోనే పోటీ చేసింది. అంటే... 41 స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యూరు. అదేవిధంగా... జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 50 స్థానాలు ఉంటే... టీడీపీ 47 స్థానాల్లోనే బరిలో ఉంది.
ఈ లెక్కన మూడు స్థానాల్లో అభ్యర్థులు లేరు. గ్రామ స్థాయిలో పార్టీ పునాదులను నిర్ధారించే ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత దయనీయంగా మారింది. జిల్లాలో మొత్తం 705 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ 557 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. 148 ఎంపీటీసీ స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముఖ్య నేతలు ఆసక్తి చూపడం లేదు. పొత్తులో భాగంగా తమ స్థానాలను బీజేపీకి కేటాయించి పోటీకి దూరంగా ఉండాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు యోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం...
1999 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని వరంగల్, హన్మకొండ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. జిల్లాలోని మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లును దక్కించుకుంది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో 2004 ఎన్నికల్లో కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లతో సరిపుచ్చుకుంది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుతో నర్సంపేట, పాలకుర్తి, ములుగు, డోర్నకల్ స్థానాలను గెలుచుకుంది. తెలంగాణపై అస్పష్ట వైఖరితో జిల్లాలో టీడీపీ బాగా దెబ్బతిన్నది. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
దీంతో ఇటీవల వరకు నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేని దయనీయ పరిస్థితిలో టీడీపీ ఉండేది. నాలుగు రోజుల క్రితమే మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. ఇప్పటికీ వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జ్ లేరు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మూడుసార్లు ప్రాతినిథ్యం వహించిన ఈ సెగ్మెంట్‌లో ఇన్‌చార్జ్‌ను నియమించకపోవడానికి ఆర్థిక అంశాలు ప్రధాన కారణమని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎస్సీ వర్గానికి చెందిన ఈ స్థానంలో ఎవరినైనా ఇన్‌చార్జ్ నియమిస్తే... ఐదేళ్లుగా తాను ఖర్చు చేసిన మొత్తానికి మరికొంత కలిపి ఇవ్వాల్సిందేనని ప్రస్తుతం సెగ్మెంట్ బాధ్యతలు చూస్తున్న వారు పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేడు హన్మకొండలో ‘ప్రజాగర్జన’
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ప్రజాగర్జన పేరుతో టీడీపీ బుధవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తోంది. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించే సభకు టీడీపీ జిల్లా నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ ఎన్నికల కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నియమితులైన తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగసభ ఇదే.
ఇతర సీనియర్ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, సీతక్క, వేం నరేందర్‌రెడ్డికి కీలక బాధ్యతలు వచ్చిన తర్వాత జరుగుతున్న సభ కావడంతో నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల తరుణంలో ఎలాగైనా విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీ ఇలా..
Published Wed, Apr 2 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement