సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులిచ్చింది. లాక్‌డౌన్ ప్రకటించడానికి పూర్వం అనుమతించిన అన్ని కార్యకలాపాలను (తాజాగా నిషేధించినవి మినహా) ఈ నెల 8 నుంచి తిరిగి ప్రారంభించడానికి అనుమతిచ్చింది. వీటితో పాటు షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లను మళ్లీ తెరిచేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతిచ్చింది. విద్యా సంస్థల నిర్వహణ, మెట్రో రైలు సేవల పునరుద్ధరణకు మాత్రం ప్రభుత్వం అనుమతుల్విలేదు.
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు జన సంచారంపై ఆంక్షలు కొనసాగుతాయి. అత్యవసర వైద్య సేవల కోసం మినహాయింపు ఉంది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు/ సంస్థలను రాత్రి 8.30 గంటల తర్వాత తెరిచి ఉంచడానికి అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలించేందుకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యకలాపాలపై నిషేధం
- పాఠశాలలు, కళాశాలలు, విద్య/శిక్షణ/కోచింగ్ సంస్థలు తదితర సంస్థలు.
- మెట్రో రైలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, క్రీడా సముదాయాలు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు.
- రాజకీయ, సామాజిక, క్రీడా, వినోద, విద్య, సాంస్కతిక కార్యక్రమాలు, ఇతర జన సామూహిక కార్యక్రమాలు.
Comments
Please login to add a commentAdd a comment