కోవిడ్‌ వైరస్‌పై ‘ర్యాపిడ్‌ రెస్పాన్స్‌’ | Telangana Government To Set Up Rapid Response Teams For Coronavirus | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వైరస్‌పై ‘ర్యాపిడ్‌ రెస్పాన్స్‌’

Published Sat, Mar 7 2020 1:38 AM | Last Updated on Sat, Mar 7 2020 1:38 AM

Telangana Government To Set Up Rapid Response Teams For Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌పై సర్కారు యుద్ధం ప్రకటించింది. అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేయాలని శుక్రవారం నిర్ణయించింది. రాష్ట్రస్థాయి రెస్పాన్స్‌ టీమ్స్‌తో పాటు ప్రతి జిల్లాలోనూ ఈ టీంలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల కాంటాక్టులను గుర్తించడం కోసం 15 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఏర్పాటైంది. అలాగే ప్రతి జిల్లాలోనూ 15 మంది చొప్పున ఈ టీంలు పనిచేస్తాయి. ఒకవేళ ఏదైనా పాజిటివ్‌ కేసు నమోదైతే ఆ కేసుకు సంబంధించి గుర్తించాల్సిన బాధ్యత వారిదే. పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతంలో 3 కి.మీ. మేరకు మ్యాపింగ్‌ చేస్తారు. అక్కడంతా యాక్టివ్‌ నిఘా ఏర్పాటు చేస్తారు. అంటే పారిశుద్ధ్యంతో పాటు క్లోజ్డ్‌ కాంటాక్టులను గుర్తించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని పనిచేస్తారు.

గుంపుల్లో ఏమాత్రం తిరగొద్దు:
జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కోవిడ్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. సభలు, సమావే శాలు జరగకుండా నిరోధించాలని అన్ని రాష్ట్రాలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఆపలేని పరిస్థితి నెలకొంటే వాటిని వాయిదా వేయించాలని కోరింది. సభలు, సమావేశాలు, ర్యాలీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత సంస్థలు, వ్యక్తులకు వివరించాలంది. అలాగే సినిమాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్, ఇతరత్రా గుంపులుండే ప్రాంతాలకు వెళ్లకుంటేనే మేలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వివిధ సంస్థల్లో హాజరు కోసం వేలిముద్రలతో బయోమెట్రిక్‌ నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ కరచాలనంతో కూడా సోకే ప్రమాదం ఉండటంతో వెంటనే బయోమెట్రిక్‌ను నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా సర్కారు ఉపక్రమించింది. వీటితోపాటు అంతర్జాతీయ విమాన ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించిన కేంద్రం అథరైజ్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్టుల వద్ద వైద్య బృందాలను ఉంచింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 107 చెక్‌పోస్టులుంటే, వాటిలో కేవలం 71 చోట్లే వైద్య బృందాలున్నాయి. మిగిలిన చోట్ల స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

104కు 210 కాల్స్‌..
కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ‘104’హెల్ప్‌లైన్‌కు విపరీతంగా కాల్స్‌ వస్తున్నాయి. అది ఏర్పాటైన 24 గంటల్లోనే 210 కాల్స్‌ వచ్చాయి. అందులో 185 మంది కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరో 25 మంది తమకు కోవిడ్‌ లక్షణాలున్నాయని తెలిపారు. అయితే ఆ లక్షణాలున్నాయని చెప్పిన వారిలో క్రాస్‌ చెక్‌ చేయగా ఆ లక్షణాలు లేవని, వారికి కనీసం ట్రావెలింగ్‌ హిస్టరీ కూడా లేదని గుర్తించి వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. హైదరాబాద్‌లో 40 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటవుతున్నాయి. ఆ ఆస్పత్రులన్నీ విధిగా తమ వివరాలను శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖకు తెలిపాయి. కాగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఆరా తీసింది. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో కేంద్ర బృందం సభ్యులు భేటీ అయ్యారు. కరోనా ఐసోలేషన్‌ వార్డుల వివరాలను సేకరించారు. అలాగే తీసుకుంటున్న చర్యలను ఆ బృందం తెలుసుకుంది.

మరింత మెరుగవుతోంది..
కోవిడ్‌ బాధితుడు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మొదట్లో అతను చాలా కుంగిపోయి కనిపించాడు. మొదట్లో అతని ఊపరితిత్తుల్లో మూడో వంతు వరకు న్యుమోనియా ఆవరించి ఉంది. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగవుతోంది. కొందరు వైద్యాధికారులు, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతను ఒక కుటుంబ సభ్యునితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ‘సాక్షి’అతని మాటలను ఆలకించింది. అతనేమన్నాడంటే, ‘నా ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంది. అమ్మా నాన్నల ఆరోగ్యం కూడా బాగుంది. ఇంటి నుంచే భోజనం వస్తుంది. ఆసుపత్రిలో చిన్న చిన్న సమస్యలున్నా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. డాక్టర్లు మంచిగా చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు నాకు తగ్గుతుందన్న విశ్వాసముంది’అని బాధితుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే తన ఫొటోలను కొందరు తీయడానికి ప్రయత్నిస్తున్నారని అతను ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

మరింత విశ్వసనీయత పెంచాలి
గాంధీఆస్పత్రి: కోవిడ్‌పై భయాందోళనలు తొలగించి అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వసనీయత పెంచేందుకు కృషి చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గాంధీ ఆస్పత్రిని శుక్రవారం రాత్రి వైద్య ఉన్నతాధికారులతో కలసి మంత్రి సందర్శించారు. కోవిడ్‌ ఐసోలేషన్, వీఐపీ వార్డులను, అత్యవసర విభాగంలోని ఎక్యూట్‌ ఐసీయూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తికి అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పర్సనల్‌ ఎక్విప్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ దుస్తులు ధరించి ఐసీయూలోకి వెళ్లారు. అద్దంలోంచి కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తిని చూసుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫోన్‌ ద్వారా సంభాషించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తి కోలుకుంటున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేష్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాసరావు, గాంధీ ఇంచార్జీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు, ఫల్మనాలజీ వైద్యులు కృష్ణమూర్తి, ప్రమోద్, ఆర్‌ఎంఓలు శేషాద్రి, నరోత్తం, గోపాల్‌లతోపాటు పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement