మారని తలరాత
సరి‘హద్దు’ మీరిన సమస్యలు
నరకానికి నకళ్లు ఆ రహదారులు పడవలు, తెప్పలే ప్రయాణ సాధనాలుబడులూ లేవు, దవాఖానా లేదుతలాపునే నీళ్లు, దాహం తీరదు వానాకాలం వణుకుడు,ఎండాకాలం ఉడుకుడు అభివృద్ధి నిధుల మంజూరు శూన్యమే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు దాటింది. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామీణ భారతం మాత్రం ఆవిష్కృతం కాలేదు.
ఇప్పటికీ చాలా వరకు పల్లెలు సమస్యల చక్రబంధంలో ఇరుక్కుని ఉన్నాయి. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నీటి మూటలేనని అవి నిరూపిస్తున్నాయి. నిజామా బాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఊళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రహదారులు లేవు. తాగడానికి నీళ్లు లేవు. చదువుకోవడానికి బడులు లేవు. రోగమొస్తే చూపించుకోవడానికి దవాఖాన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఎవ్వరికీ పట్టని జనావాసాలు. ఇక్కడి దీనస్థితిపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
- బాన్సువాడ
పడేసినట్లున్న ఊళ్లు
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గ్రామాలు. వీటికి కూతవేటు దూరంలో, మహారాష్ట్ర, కర్ణాటకలోని గ్రామాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలు, మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల గ్రామాలన్నీ సరిహద్దుకే ఆనుకొని ఉన్నాయి. ముఖ్యంగా జుక్కల్ మండలంలోని బాబుల్ గాం, శక్తినగర్, చింతల్‌వాడి, చింతల్‌వాడి తాండ, హట్యానాయక్ తాండ, కంగ్టి మండలంలోని బోర్గి, చౌకన్‌పల్లి తదితర గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
బడా సమస్యల బాబుల్‌గాం
బాబుల్‌గాం గ్రామం ద్వీపకల్పంలా ఉంది. ఈ గ్రామాన్ని మూడు వైపులా కౌలాస్‌నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆవరించి ఉంది. ఏడాదికి 12 నెలలూ ఇదే పరిస్థితి. బా బుల్‌గాం నుంచి విఠ ల్‌వాడికిగానీ, జుక్కల్‌కుగానీ వెళ్లాలంటే వానాకాలంలో 60 కిలోమీటర్లు, ఎండాకాంలో 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిందే. వాస్తవానికి బాబుల్‌గాం నుంచి జుక్కల్‌కు పది కిలోమీటర్ల దూరమే ఉన్నా, కౌలాస్‌నాలా బ్యాక్ వాటర్‌తోపాటు రోడ్డు సరిగా లేక ఆ గ్రామ ప్రజలు 50 కిలోమీటర్లు అధికంగా తిరగాల్సి వస్తోంది.
వర్షాకాలంలో కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండితే బాబుల్‌గాం పూర్తిగా మునిగినట్టే. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు అక్కడి ప్రజలు. ఈ గ్రామానికి మండలస్థాయి అధికారులు ఎవరూ రారు. ఎప్పుడైనా వస్తే వారు రోజంతా ఇక్కడే గడపాలి. మరో రెండు రోజులు సెలవు పెట్టాలి. అయితేనే ఆ గ్రామానికి చేరుకొంటారు. గ్రామం చెంతనే కేఎన్‌పీ బ్యాక్‌వాటర్ ఉన్నా, బోర్లు మాత్రం పని చేయవు. రాళ్లతో కూడిన రహదారిపై కాలి నడకన వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. బడి ఉన్నా పేరుకే..ఉపాధ్యాయులు లేరు. దవాఖానా లేదు. రోగమొస్తే తెప్పలెక్కి పట్టణానికి పోవలసిందే.
తండాల పరిస్థితీ అంతే!
బాబుల్‌గాం సమీపంలో ఉండే హట్యానాయక్ తాండ, చింతల్‌వాడి తాండ, చౌకన్‌పల్ల తాండాలలో గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అవి క్షేత్ర స్థాయిలో అందడం లేదనడానికి ఈ తండాలే నిదర్శనం. తాగునీటి కోసం ఈ తండాల వా సులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లా కంగ్టీ మండలం చౌకన్‌పల్లికి వెళ్తున్నారు.రాష్ట్రంలోనే వెనుకబడి ఉన్న జుక్కల్ సెగ్మెంట్‌లోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
గోజెగాం గ్రామం మద్నూర్ మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, లెండి వాగు అడ్డంగా ఉండడంతో గ్రామస్తులు 30 కిలోమీటర్ల వరకు తిరిగి, మహారాష్ట్ర ద్వారా మద్నూర్‌కు వస్తున్నారు. గోజెగాం వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గం గారాం హయాంలో కోటి రూపాయలు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ నిధులను లింబూర్-మద్నూర్ రోడ్డు నిర్మాణానికి మళ్లించారు. దీం తో గ్రామస్తుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతం పనులు మందకొడిగా సాగుతున్నాయి. జుక్కల్ మండలంలోని బాబుల్‌గాం, శక్తినగర్, చింతల్‌వాడి గ్రామాలు ప్రతీ వర్షాకాలంలో కౌలాస్‌నాలా బ్యాక్ వాటర్‌తో జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.