బిచ్కుంద (నిజామాబాద్): పురుటి నొప్పులతో అవస్థ పడుతూ ఎలాగోలా అస్పత్రికి చేరుకున్న ఓ గర్భిణి పట్ల అక్కడి వైద్య సిబ్బంది కనీస మానవత్వం కూడా లేకుండా వ్యవహరించారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఆమెను బయటకు గెంటేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ మహిళ ఆస్పత్రి బయటే మగబిడ్డను ప్రసవించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద ఆస్పత్రి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథ్ పల్లి తండాకు చెందిన దశ్వతి బాయి పురుటి నొప్పులు తీవ్రం కావడంతో ఉదయం 9 గంటలకు ప్రసవం కోసం 108 వాహనంలో ఆస్పత్రికి వచ్చింది. అప్పటి వరకూ తీసుకున్న వైద్యానికి సంబంధించి పత్రాలు చూపించాలని సిబ్బంది అడిగారు. తీసుకురాలేదని, నొప్పులు తీవ్రంగా ఉన్నాయని ఆమె వేడుకున్నా సిబ్బంది కనికరించలేదు.
డాక్టర్ అందుబాటులో లేరంటూ బాన్సువాడ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పురుటి నొప్పులతో ఆ మహిళ రెండు గంటల పాటు ఆస్పత్రి ఆవరణలో నరకం అనుభవించింది. చివరకు ఓ బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత అయినా వైద్య సిబ్బందిలో చలనం లేదు. శిశువు జన్మించి గంట దాటినా సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించ లేదు. ఇక చేసేది లేక తల్లి, బిడ్డను కుటుంబ సభ్యులు దెగ్లూర్ ఆస్పతికి తీసుకెళ్లారు. అయితే, డాక్టర్ జ్యోతి సుభా ఇంటి వద్ద ఉన్నప్పటికీ ఆస్పత్రికి వచ్చి వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.