అవగాహనతోనే అప్రమత్తం | Today World AIDS Day Adilabad Health Department | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే అప్రమత్తం

Published Sat, Dec 1 2018 8:54 AM | Last Updated on Sat, Dec 1 2018 8:54 AM

Today  World AIDS Day Adilabad Health Department - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ఎయిడ్స్‌ మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. అంతుచిక్కని వ్యాధిపై కొందరికి అవగాహన లేకపోవడం కారణంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఐవీకి చికిత్స లేదు. నివారణ ఒకటే మార్గం. అప్రమత్తతోనే వ్యాధిని నివారించవచ్చు. అవగాహన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 15వేలకు బాధితులు ఉన్నారు. సురక్షితం లేని లైంగిక సంబంధాలు, రక్త మార్పిడితో హెచ్‌ఐవీ వ్యాప్తి చెందుతోంది. గతం కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా కథనం.

ఉమ్మడి జిల్లాలో...
ఉమ్మడి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకా రం జిల్లాలో 10,435 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కానీ అనధికారికంగా వీరి సంఖ్య 15వేలకు పైగా ఉంటుందని అంచనా. గతం కంటే ప్రస్తుతం జిల్లాలో హెచ్‌ఐ వీ తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ చాలామంది యువత రక్త పరీక్షలు చేయించుకునేందు కు ముందుకు రావడం లేదు. నిరక్షరాస్య త, అవగాహనలేమితో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో వ్యాధి గ్రస్తులు అధికంగా ఉన్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 73,967 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా.. 325 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. 31,058 మంది గర్భిణులు వైద్య పరీక్షలు చేయిం చుకోగా.. 24 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ గుర్తించారు. ఏజెన్సీ మండలాల్లో అవగాహన లేక గిరిజనులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

సమీకృత  కౌన్సెలింగ్‌ కేంద్రాలు
ఉమ్మడి జిల్లాలో 16 సమీకృత కౌన్సెలింగ్‌ కేంద్రాలు, 12 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా హెచ్‌ఐవీ పరీక్షలు చేసుకోవచ్చు. ఆదిలాబాద్‌ రిమ్స్, నిర్మల్, మంచిర్యాల, భైంసా, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్, మందమర్రి, ఉట్నూర్, ఖానాపూర్, చెన్నూర్, ముథోల్, కాగజ్‌నగర్‌ ఏరియా ఆస్పత్రుల్లో కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 71 పీహెచ్‌సీల్లో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆరు సుఖవ్యాధి చికిత్సల కేంద్రాలు, రిమ్స్‌లో ఏఆర్టీ సెంటర్, తొమ్మిది లింక్‌ ఏఆర్టీ సెంటర్లు ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు వారికి పుట్టబోయే పిల్లలకు వ్యాధి సోకకుండా నెవరాపిన్‌ ట్యాబ్‌లెట్‌ను ఇస్తారు. ఐసీటీసీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ ఉచిత పరీక్షతోపాటు వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీకి మందులను అందజేస్తారు. వారి కుటుంబ సభ్యలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 3వేల మంది వరకు బాధితులు మందులు వాడుతున్నారు. దాదాపు 1500 మంది ఆసరా పింఛన్‌ పొందుతున్నారు. 

ఆత్మస్థైర్యం  కలిగి ఉండాలి
హెచ్‌ఐవీ సోకిన వారు ఆత్మస్థైర్యంతో కలిగి ఉండడంతోపాటు జాగ్రత్తలు తీసుకుంటే తమ ఆయుష్షును పొడగించుకోవచ్చు. ముఖ్యంగా మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. యోగా, వ్యాయామం చేయాలి. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పండ్లు, గుడ్లు, పప్పుధాన్యాలు, పాలు ఉండేలా చూడాలి. హెచ్‌ఐవీ వైరస్‌ శరీరంలోని రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుంది. ఏఆర్టీ మందులను వాడితే రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. మద్యం, పొగాకు, ధూమపానం అలవాట్లను మానుకోవాలి. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కండోమ్‌ తప్పనిసరిగా వాడాలి.– రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌ఓ, ఆదిలాబాద్‌

సహాయం  అందిస్తున్నాం..
వ్యాధి బారిన పడిన వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. వారికి ఎదురైనా ఇబ్బందులను తొలగిస్తున్నాం. సమాజం వారిని వివక్షతో చూడకుండా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. వ్యాధి సోకిన వారు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మందులు ఎలా వాడాలి, కుటుంబ సభ్యులకు వారిని చిన్నచూపు చూడకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం.– సరిత, అదిలా ఆదర్శ హెచ్‌ఐవీ పాజిటీవ్‌ పీపుల్‌ వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు

వ్యాధి లక్షణాలు..
వ్యాధిగ్రస్తులకు నాలుగుదశల లక్షణాలు కనిపిస్తాయి. మొదటి దశలో ఫ్లూ జ్వరం, రక్తంలో వైరస్‌ సంఖ్య అ ధికంగా ఉన్న ప్రతిరక్షకాలు కనిపిం చవు. రెండో దశలో హెచ్‌ఐవీ ఉనికి తెలుస్తుంది. కానీ వ్యక్తిలో బాహ్యం గా కనిపించవు. మూడో దశలో వ్యా ధి నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుం ది. నాలుగో దశలో దీర్ఘకాలిక జ్వ రం, నీళ్ల విరోచనాలు, నోటి పుళ్లు, లింప్‌ గ్రంధులు వాచడం, శరీర బరువు పది శాతం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

వ్యాధి సోకుతుందిలా..
సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల వ్యాధి సోకుతుంది. వ్యాధిగ్రస్తులకు వాడిన సిరంజీలను మళ్లీ ఇతరులకు వాడినా వ్యాధి బారిన పడతారు. వ్యాధిగ్రస్తులకు వాడిన బ్లేడ్‌ వాడడంతో కూడా వ్యాధి సోకే ప్రమాదాలు ఉన్నాయి. కండోమ్‌ వాడడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

1995లో తొలికేసు..
జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో 1995లో మొదటిసారి హెచ్‌ఐవీ కేసు నమోదైంది. ఈ కేసు నమోదై ఇప్పటికి రెండు దశాబ్దాలు దాటింది. తొలి కేసు నమోదుతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వెంటనే  వీసీటీసీలను ఏర్పాటు చేసింది.

ప్రచారం, అవగాహన అంతంతే..
వ్యాధి నివారణే తప్పా చికిత్స లేని హెచ్‌ఐవీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ యువతను ఇంకా మేల్కొలిపే చర్యలు చేపట్టాలి. గతంలో సినిమా హాళ్లలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన స్లైడ్స్‌/లఘు చిత్రాలు ప్రదర్శించేవారు. స్వచ్ఛంద సంస్థలు, కళాజాతల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించేవారు. దీంతో నిరక్షరాస్యులకు దానిపై అవగాహన ఏర్పడేది. బస్టాండ్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేసేవారు. ఇటీవల కాలంలో హెచ్‌ఐవీ కొంత తగ్గుముఖం పట్టడంతో అవగాహన కార్యక్రమాలు కూడా కనిపించడంలేదు. చాలా చోట్ల ఏరియా ఆస్పత్రులు మొదలుకుని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రచార సామగ్రి అటకెక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement