జెడ్పీపై టీఆర్‌ఎస్ గురి
సంగారెడ్డి డివిజన్: జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమవుతోం ది. జెడ్పీ చైర్మన్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నేత లు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఏకంగా జిల్లా మంత్రి హరీష్‌రావు స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
క్యాంపునకు ఏర్పాట్లు
టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు జెడ్పీటీసీలతో పాటు ఇటీవల పార్టీలో చేరిన గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలను, పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న మరికొంత మంది జెడ్పీటీసీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శనివారమే టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలను క్యాంపునకు తరలించాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కానట్లు సమాచారం.
దీంతో జెడ్పీటీసీలందరినీ సోమవారం క్యాంపునకు తరలించేందుకు టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపులో ఉన్న జెడ్పీటీసీలు తిరిగి చైర్మన్ ఎన్నిక జరిగే 5వ తేదీన సంగారెడ్డికి చేరుకునేలా టీఆర్‌ఎస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదిలావుంటే మంత్రి హరీష్‌రావు శనివారం సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమావేశమై జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.
పెరిగిన టీఆర్‌ఎస్ బలం
జిల్లాలోని 46 జెడ్పీటీసీ స్థానాలుండగా, టీఆర్‌ఎస్ 21 జెడ్పీటీసీలను సొంతం చేసుకుంది. ఇటీవలే గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ బలం 26కు చేరింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తప్పకుండా టీఆర్‌ఎస్ పార్టీకే దక్కే అవకాశాలున్నాయి. దీంతో చైర్మన్‌గిరీ ఎవరికి దక్కుతుందోనని టీఆర్‌ఎస్ శ్రేణులన్నీ చర్చించుకుంటున్నాయి.
రాజమణికే చైర్మన్ ఛాన్స్?
జెడ్పీ చైర్మన్ ఎన్నిక అంశంపై మంత్రి హరీష్‌రావు శనివారం తనను కలిసి జిల్లా ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నర్సాపూర్ జెడ్పీటీసీ రాజమణికి జెడ్పీ చైర్మన్‌గిరీ కట్టబెట్టే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పదవి రాజమణికే దక్క వచ్చని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. రాజమణి నర్సాపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మురళీయాదవ్ భార్య కావటంతో ఆమె వైపు పార్టీ నాయకత్వం మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉన్న కొండాపూర్ జెడ్పీటీసీ నాగరాణికి పదవి దక్కే అవకాశాలు కానరావటం లేదు. మరోవైపు జెడ్పీ వైస్ చైర్మన్ పదవిపై కూడా టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
నేడు కాంగ్రెస్ నేతల భేటీ
జూలై 5న జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నిక రోజు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆదివారం భేటీ కానున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కిష్టారెడ్డి, మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తదితర నేతలు హైదరాబాద్‌లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో విప్ జారీ ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.