టీఆర్‌ఎస్ హవా | TRS party in first place | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ హవా

Published Thu, Jul 3 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

టీఆర్‌ఎస్ హవా

టీఆర్‌ఎస్ హవా

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గురువారం జరిగిన మున్సిపల్ సారథుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ఎంతో ఉత్కంఠతను రేపుతాయనకున్న ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. చైర్మన్ ఎన్నికకు ఒకరోజు ముందు వరకూ మారిన సమీకరణాలు..ప్రలోభాలు..క్యాంపులు ఇలా అనుక్షణం ఉత్కంఠతకు రేపిన మున్సిపల్ ఎన్నికలు చివరకు సజావుగా ముగిశాయి. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మెజార్టీ సాధించటంతో టీఆర్‌ఎస్ నాలుగు, కాంగ్రెస్ రెండు చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి.
 
 మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు వ్యూహరచన ఫలించింది. జహీరాబాద్, సదాశివపేటలో తగినంత మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవులను దక్కించుకోలేకపోయింది. ఇక్కడ టీఆర్‌ఎస్ ఎత్తుగడ పారటంతో ఆ పార్టీ చైర్మన్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎక్కింది.
 
 ఒప్పందం ప్రకారం వైస్‌చైర్మన్ పదవిని బీజేపీకి ఇవ్వాలి. అయితే వైస్‌చైర్మన్ అభ్యర్థి పేరును ప్రకటించగానే కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో నుంచి చల్లగాజారుకుని బీజేపీకి చేయిచ్చారు. దీంతో ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నిక సందర్భంగా విప్‌లు అస్త్రంగా మారుతాయని భావిస్తే వాటి ప్రభావం ఏమాత్రం కనిపించ లేదు. కొన్నిచోట్ల విప్‌ను  ధిక్కరించి.. కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వగా.. కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విప్ జారీ చేయకపోవడం గమనార్హం.
 
 నాలుగు చోట్ల టీఆర్‌ఎస్, రెండుచోట్ల కాంగ్రెస్  
 టీఆర్‌ఎస్ పార్టీ మూడు మున్సిపాలిటీలను, ఒక నగర పంచాయతీని దక్కించుకుంది. కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నగరపంచాయతీలో కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో టీఆర్‌ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ  కౌన్సిలర్ గాడిపల్లి భాస్కర్ చైర్మన్‌గా ఎన్నిక కాగా వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైస్ చైర్మన్ అభ్యర్థి పేరును ఖరారు చేయటంలో జాప్యం కారణంగా వైస్‌చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. శుక్రవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ, ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు కాంగ్రెస్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంది. బొంగుల విజయలక్ష్మి ఇక్కడ రెండోమారు కాంగ్రెస్ తరఫున చైర్మన్‌గా ఎన్నికైంది. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీ టీడీపీ, ఎంఐఎం, స్వతంత్ర, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్ పదవి కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ మెజార్టీ సాధించటంతో కాంగ్రెస్ కౌన్సిలర్‌లు చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. మంత్రి గీతారెడ్డి సైతం ఓటు హక్కు వినియోగించుకోలేదు.  చైర్మన్‌గా ఎంపీ బీబీ పాటిల్ ఎక్స్‌అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
  సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ చైర్మన్ పదవి చేజారింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు టీఆర్‌ఎస్‌లో చేరటంతో పట్నం విజయలక్ష్మి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
 
 వైస్ చైర్మన్‌గా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. మెదక్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ మెజార్టీ ఉండటంతో ఇక్కడ ఆ పార్టీకి చెందిన మల్లికార్జున్‌గౌడ్ చైర్మన్‌గా, అశోక్ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జోగిపేట నగర పంచాయతీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఆ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కవితా సురేందర్‌గౌడ్ చైర్మన్‌గా  తుడుం రాములు వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement