అమిత్ షా పోస్టర్‌పై మహారాష్ట్రలో కలకలం
ముంబై: అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న బీజేపీ-శివసేన సంబంధాల్లో తాజా వివాదం మరింత ఆజ్యం పోసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఎద్దేవా చేస్తూ మహారాష్ట్రలో శివసేన శ్రేణులు ప్రదర్శించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా బీజేపీ ముంబై యూనిట్ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ దిష్టిబొమ్మను శివసేన కార్యకర్తలు తాజాగా తగులబెట్టారు. దీంతో మిత్రపక్షం శివసేనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. ఆ పార్టీకి దీటుగా బుద్ధి చెప్తామంటూ బాహాటంగా హెచ్చరికలు జారీచేసింది.
గత కొన్నాళ్లుగా బీజేపీపై శివసేన చేస్తున్న విమర్శలకు కమలం అధికార పత్రిక ‘మనోగత్’లో సమాధానం ఇచ్చిన మాధవ్ భండారి దమ్ముంటే కమలనాథులతో సేన తెగదెంపులు చేసుకోవచ్చునని సవాల్ విసిరారు. ఎప్పుడు విడాకులు తీసుకురంటూ సేనను నేరుగా ప్రశ్నించారు. ఈ వ్యాసంపై కస్సుమన్న శివసేన తాజాగా బీజేపీ సిటీ యూనిట్ చీఫ్ షెల్లార్ దిష్టిబొమ్మను తగులబెట్టింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ సారథి అమిత్ షాను గబ్బర్ సింగ్‌గా, ఆ పార్టీ అధికార ప్రతినిధి మాధవ్ బండారిని శకుని మామగా చిత్రిస్తూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లపై బీజేపీ మరింత కస్సుమంది. శివసేన తన శ్రేణులను అదుపులో పెట్టుకోవాలని, అది చేతగాకపోతే తామే సేన శ్రేణులకు గట్టిగా బుద్ధి చెప్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుజిత్ సింగ్ ఠాకూర్ తాజాగా హెచ్చరించారు.